Revanth Reddy: గాంధీ భవన్‌లో జరిగిన పీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలపై మాట్లాడారు. ఇండియా కూటమి తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించినందుకు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ, పౌర హక్కుల కోసం జస్టిస్ సుదర్శన్ రెడ్డి చేసిన కృషి దేశానికి ఆదర్శమని సీఎం ప్రశంసించారు.
రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో కులగణన చేపట్టామని, బీసీ వర్గాల సంక్షేమం కోసం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రివర్గం ఆమోదం తీసుకుని అసెంబ్లీలో బిల్లు పాస్ చేశామని సీఎం స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రత్యేక బిల్లును తీసుకొచ్చామని చెప్పారు.
అయితే, గతంలో కేసీఆర్ ప్రభుత్వం 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఉండకూడదని చట్టం తెచ్చిందని, ఇది బీసీలకు పెద్ద అడ్డంకిగా మారిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ అడ్డంకిని తొలగించేందుకు ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపించామని, రాష్ట్రపతి ఆమోదం వచ్చిన తర్వాత బీసీలకు పూర్తిస్థాయిలో రిజర్వేషన్లు అందుతాయని హామీ ఇచ్చారు.
90 రోజులలో రాష్ట్రపతి బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు ముందు వాదించేందుకు ఇద్దరు న్యాయవాదులను నియమించామని సీఎం వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లుపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పారు. విడిగా సుప్రీంకోర్టులో కేసు వేసుకుంటే కేసు లిస్ట్ కావడానికి ఎక్కువ సమయం పడుతుందని, అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నామని చెప్పారు.
రాహుల్ గాంధీ మాట నిలబడుతుందని, బీసీ వర్గాల అభ్యున్నతే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ తెచ్చిన చట్టం ప్రకారం బీసీలకు ఒక్క శాతం కూడా రిజర్వేషన్ రాదని, ఆ అన్యాయాన్ని సరిచేయడానికి ఈ చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.
Also Read: Vizag real estate: విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. చీప్ అండ్ బెస్ట్ ప్లాట్ కావాలా? ఇదే ఛాన్స్!
రాబోయే 26న బీహార్‌లో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఓటు చోరీ పాదయాత్రకు హాజరవుతానని ప్రకటించిన రేవంత్ రెడ్డి, ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు బలాన్నిస్తుందని చెప్పారు.
ఇక వ్యవసాయ రంగ సమస్యలపై కూడా సీఎం స్పందించారు. బీఆర్‌ఎస్, బీజేపీ కలసి యూరియా కొరతపై డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించిన ఆయన, యూరియా ఇచ్చే పార్టీకి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తానని కేటీఆర్ చెప్పడం వాళ్ల వైఖరిని బహిర్గతం చేస్తోందని అన్నారు.
యూరియా సరఫరా కోసం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అనుప్రియా పటేల్‌లను నాలుగుసార్లు కలిశానని, రాష్ట్రానికి కావాల్సినంత యూరియా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. యూరియా పంపిణీపై శేత్రస్థాయిలో మానిటరింగ్ పెంచాలని అధికారులను ఆదేశించానని సీఎం స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లు, రాజ్యాంగ పరిరక్షణ, పౌరహక్కులు, వ్యవసాయ సమస్యల పరిష్కారం.. ఈ నాలుగు అంశాలపై తన ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో స్పష్టం చేశారు.