Telangana Formation Day: తాము అధికారం చేపట్టేనాటికి తెలంగాణలో వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారాయన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ప్రస్తుతం రాష్ట్రాన్ని పునర్ నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్‌లో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రజల కలలను సాకారం చేసిన పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ అమర వీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. పదేళ్లుగా నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ అభివృద్ధికి మహిళా శక్తి తొలి ప్రాధాన్యమన్నారు. మహిళా సాధికారితే ప్రజా ప్రభుత్వం లక్ష్యమన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉపాధి, విద్యార్థుల యూనిఫామ్‌లు తయారీ వారికే అప్పగించామన్నారు. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్లను కూడా మహిళల పేరు మీద ఇస్తున్నట్లు తెలిపారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే ప్రభుత్వం ధ్యేయమన్నారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. ధరణి కొందరికి చుట్టమైతే, భూభారతి ప్రజల రక్షణ చట్టమన్నారు. కేవలం ఏడాదిలో 60 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని, పెట్టుబడుల ద్వారా లక్షమందికి ఉపాధి కల్పించామన్నారు.
ALSO READ: న్యూయార్క్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
ఉద్యోగ భర్తీతో నిరుద్యోగుల విశ్వాసాన్ని చూరగొన్నామన్నారు. యంగ్ ఇండియా పాఠశాలల ద్వారా విద్యార్థులకు నైపుణ్యాలు పెంచడమే తమ ధ్యేయమన్నారు. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ లేకపోవడం బాధాకరమన్నారు. క్రీడాకారులను ప్రొత్సహించడానికే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అని మరోమారు క్లారిటీ ఇచ్చారు.
ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. విద్య మీద పెట్టే డబ్బు ఖర్చుకాదని, భవిష్యత్‌కు పెట్టుబడిగా వర్ణించారు సీఎం రేవంత్ రెడ్డి. పేదల ఆరోగ్యమే మా ప్రభుత్వ బాధ్యత అని చెబుతూనే, ఆసుపత్రుల్లో మౌళిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టామన్నారు. 2,700 కోట్ల రూపాయలతో ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తున్నట్టు తెలిపారు.
పదేళ్ల కిందట దేశంలో కుల గణన జరిగిందని, దేశంలో తొలిసారి తెలంగాణలోనే కులగణన జరిగిందన్నారు ముఖ్యమంత్రి. 56 శాతం ఉన్న బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రం నిర్ణయించిందని, కులగణన విషయంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.
ప్రపంచంతో తెలంగాణ పోటీ పడేలా పాలసీ తీసుకొస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. మూసీ నదికి పూర్వ వైభవం తెచ్చేందుకు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు అని అన్నారు. న్యూయార్క్, టోక్యోతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఫోర్త్ సిటీ రానుందన్నారు. అలాగే పెట్టుబడులకు ఫ్యూచర్ సిటీ కేంద్రబిందువు కానుందన్నారు.
హైదరాబాద్ ను మరింత తీర్చిదిద్దేందుకు జపాన్ సహకరిస్తుందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసన్న ముఖ్యమంత్రి, రీజినల్ రింగ్ రోడ్డుతో రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయన్నారు. మెట్రో విస్తరణ లేకపోవడం వల్ల హైదరాబాద్ 9వ స్థానానికి పడిపోయిందన్నారు. త్వరలో మెట్రోను విస్తరించి అందరికీ అందుబాటులోకి తెస్తామన్నారు.
దేశంలోనే నెంబర్ పోలీసింగ్ వ్యవస్థ తెలంగాణలో ఉందన్నారు. శాంతి భద్రతలను కాపాడడంలో తెలంగాణ పోలీసులే నెంబర్ వన్ అని ప్రస్తావించారు. ముఖ్యంగా డ్రగ్స్ ను నియంత్రించడంలో రాష్ట్ర పోలీసులకు అవార్డు వచ్చిందన్నారు. ఇటీవల నిర్వహించిన మిస్ వరల్డ్ 2025 పోటీల గురించి మాట్లాడారు. 108 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ పోటీల్లో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మందికి కోటి రూపాయల నగదు పురస్కారం అందజేశారు సీఎం రేవంత్‌రెడ్డి. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా పెరేడ్ గ్రౌండ్స్‌లో వారికి నగదు పురస్కారం అందజేశారు. వారిలో గద్దర్ కూతురు విమలమ్మకు కోటి అందజేశారు. ఎక్కా యాదగిరి రావు, అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరికి ఈ పురస్కారాన్ని అందజేశారు.
దివంగత గూడ అంజయ్య, బండి యాదగిరి నగదు పురస్కారాన్ని అందుకున్నవారిలో ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రోజు సీఎం రేవంత్‌రెడ్డి దీనిపై ప్రకటన చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న గోరటి వెంకన్న తరపున ఆయన కూతురు పురస్కారాన్ని అందుకున్నారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 19 మంది పోలీస్ అధికారులకు మెడల్ ఫర్ గ్యాలంట్రీ ఇచ్చారు. దీని కింద ఆ పదకొండు మందికి మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డులను అందజేశారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.