CM Revanth Reddy: అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో తమ ప్రభుత్వం పాలన సాగిస్తుందని, అది ఓర్వలేకనే బీఆర్ఎస్ అడ్డగోలు విమర్శలు సాగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొల్లాపూర్ నియోజక వర్గం జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ శంకుస్థాపన కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎంకు స్థానిక ప్రజలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు.
బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినా ఏడాదిలోనే ఎన్నో అద్భుతాలను సాధించిందన్నారు. వరుస పథకాలను ప్రవేశపెడుతూ ప్రజా సంక్షేమానికి పాటుపడ్డ ప్రభుత్వంగా కాంగ్రెస్ సర్కార్, ప్రజల మద్దతు పొందిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ తాము ముందుకు సాగుతున్నామని, అన్ని విషయాలను ప్రజలు గమనిస్తున్నట్లు సీఎం అన్నారు.
ఉచిత కరెంట్ క్రెడిట్ మాదే!
దేశంలోనే ఉచిత కరెంట్ ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం మాట్లాడుతూ.. 2004లో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత కరెంటు పథకానికి శ్రీకారం చుట్టారని, అదే రీతిలో నేడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఎన్నో కుటుంబాలకు మేలు చేకూరుస్తున్నామన్నారు.
మహిళలకు.. పథకాలతో లబ్ధి!
ఏడాది పాలనలో ఓవైపు రాష్ట్ర అభివృద్ధి సాగిస్తూ మరోవైపు మహిళా సంక్షేమానికి పాటుపడ్డ ఘనత తమ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని సీఎం అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగా ఫ్రీ బస్సు స్కీమ్ అమలు చేసి, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని చేరువ చేసామన్నారు. అంతేకాకుండా మహిళలు కోటీశ్వరులు కావాలన్న లక్ష్యంతో పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, ఇతర స్కీములతో అధిక ప్రయోజనం చేకూర్చిన ఘనత తమకే దక్కుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రతి అక్క, చెల్లి గమనిస్తున్నారని, బీఆర్ఎస్ మాత్రం కడుపు మంటతో విమర్శలు గుప్పిస్తుందన్నారు.
కేసీఆర్, కేటీఆర్ ఓర్వలేక విమర్శలు!
తాము చేస్తున్న అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని చూసి ఓర్వలేక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నట్లు సీఎం అన్నారు. రెండున్నర ఏళ్లలో మరో 40,000 ఉద్యోగాలు ఇచ్చేందుకు తాము ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 60000 పైగా ఉద్యోగాలను ఇచ్చామని, బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్ల ఊసే లేదన్నారు. కేటీఆర్ సెల్ఫ్ డబ్బా మానుకోవాలని, ఐటీ తెచ్చారో ఏమో కానీ, రాష్ట్రాన్ని నాశనం చేసిన ఘనత మాత్రం బీఆర్ఎస్ దక్కుతుందని సీఎం విమర్శించారు.
ఎవ్వరు అడ్డుకున్నా.. ప్రజా సంక్షేమాన్ని ఆపలేరు!
తమ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని, అలాగే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను చేరువ చేయడంలో ప్రత్యేక ప్రణాళిక ద్వారా ముందుకు సాగుతుందని సీఎం అన్నారు. ఎన్ని విమర్శలు, కుట్రలు పన్నినా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం ఎవరివల్ల కాదన్నారు. కార్పొరేట్ పాఠశాలల వైపు తెలంగాణలోని విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కువ మొగ్గు చూపుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.
కాస్మోటిక్ చార్జీలను పెంచి, విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనాన్ని అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని సీఎం అన్నారు. పేద ధనిక అనే తేడా లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు దరి చేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. 2034 వరకు సీఎంగా తనను ప్రజలు ఆశీర్వదిస్తారని, ఈ విషయాన్ని ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ గుర్తుపెట్టుకోవాలని సీఎం అన్నారు. సీఎం ప్రసంగం సాగిస్తున్నంత సేపు, ప్రజలు జై రేవంత్ రెడ్డి జై తెలంగాణ అంటూ నినదించారు.
అలాగే సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేస్తున్నా అంటూ సీఎం ప్రసంగించారు. రాయలసీమకు మూడు టీఎంసీల నీరును తరలించే ప్రాజెక్టును రద్దుచేసి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల పూర్తికి సహకరించండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ద్వారా కోరారు. అలాగే గతంలో పాలమూరును దత్తత తీసుకున్నట్లు ఉమ్మడి రాష్ట్ర సీఎం హోదాలో చంద్రబాబు చెప్పారని, ఆ విషయాన్ని సీఎం ప్రస్తావించారు. అలాగే తమ రాష్ట్రానికి సంబంధించిన నీటి ప్రాజెక్టుల పూర్తికి అడ్డుతగలకుండా, సీఎం చంద్రబాబు పూర్తిస్థాయిలో సహకరించాలని సీఎం అన్నారు. ఎవరు అడ్డుకున్నా రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత తనదేనంటూ సీఎం అన్నారు.