CM Revanth Reddy : రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. విజయవంతంగా సింగపూర్ పర్యటనను ముగించుకున్నారు. అక్కడి నుంచి దావోస్ లో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు వెళ్లనున్నారు. గతేడాది సీఎం చోరవతో పెద్ద ఎత్తున వివిధ రంగాల్లో పెట్టుబడుల్ని ఆకర్షించగా ఈ ఏడాది.. గత రికార్డును తిరగరాయాలని సంకల్పించారు. ఈ మేరకు.. అధికారులు.. వివిధ సంస్థల ప్రతినిధులతో చర్యలు జరుపుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం నూతనంగా చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు వివరాలు.. అందించనున్న సహాయ సహకారాలపై స్పష్టమైన సమాచారాన్ని అందజేస్తూ.. పెట్టుబడులు రాబట్టేందుకు కృషి చేస్తున్నారు.
సింగపూర్ లో మూడు రోజుల పాటు విస్తృతంగా పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. వివిధ సంస్థలతో సమావేశమయ్యారు. చివరి రోజున సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ (SBF) సభ్యులతో సమావేశమయ్యారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు మిగతా తెలంగాణాలోని జిల్లాల్లో అపార అవకాశాలున్నాయని, అక్కడ పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానాలు పలికారు. అక్కడ పెట్టుబడులు పెట్టేందుకున్న అవకాశాలు, ప్రభుత్వ విధి విధానాలపై చర్చించారు. మూడు రోజుల పర్యటన విజయవంతంగా ముగియడంతో.. రేపు దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో.. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, మిగతా మంత్రివర్గ సహచరులు పాల్గొననున్నారు.
మొత్తంగా సింగపూర్ లోమూడు రోజులపాటు సీఎం బృందం పర్యటన కొనసాగింది. ఇందులో మూడు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తొలిరోజు.. రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్శిటీలో ఆధునిక నైపుణ్య శిక్షణ, వసతులు, నైపుణ్యాల అభివృద్ధిపై పరిశోధనకు ఊతం అందించేలా.. సింగపూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ – ఐటీఈ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ యూనివర్శిటీ అందించే కోర్సులు, వివిధ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించేలా.. మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా నైపుణ్యాల శిక్షణకు సహాయ సహకారాలు అందించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అందుకు అంగీకరించిన ఐటీఈ.. హైదరాబాద్ లో పర్యటించేందుకు అంగీకరించింది.
రెండో రోజు పర్యటనలో సింగపూర్‌లోని ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ ఆఫీస్ ను సందర్శించిన బృందం.. రాష్ట్రంలో అత్యాధునిక ఏఐ సెంటర్ నెలకొల్పేలా చర్చలు జరిపింది. ఏకంగా రూ.3,500 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం కుదరగా.. ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్ పేటలో ఈ సంస్థను నెలకొల్పనున్నారు. ఈ మేరకు సదరు సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సమక్షంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఎస్ టీటీ గ్రూప్ సీఈవో బ్రూనో లోపెజ్ పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. 100 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డాటా సెంటర్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇది ఏర్పాటు ఐతే.. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్లలో ఇది ఒకటిగా నిలుస్తుందంటున్నారు.
Also Read : మావోయిస్టు పార్టీకి చావు దెబ్బ.. కీలక నేతలపై బులెట్ల వర్షం..
మూడో రోజు పర్యటనలోనూ సీఎం రేవంత్ రెడ్డి బృందం భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్ ఏర్పాటు చేసేందుకు క్యాపిటల్యాండ్ సంస్థతో రూ.450 కోట్ల పెట్టుబడులను రాబట్టింది. ఈ గ్రూప్ నేతృత్వంలో ఒక మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ఐటీ పార్క్ అభివృద్ధి చేయనుండగా.. అందుకు ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి హామి ఇచ్చారు. క్యాపిటల్యాండ్ ప్రధాన కార్యాలయం సింగపూర్‌లో ఉంది. ప్రపంచంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీల్లో ఇది కూడా ఒకటి. వివిధ వ్యాపారాలు సైతం చేస్తోంది. రిటైల్ ఆఫీస్, లాజిస్టిక్స్, డేటా సెంటర్ల ద్వారా కార్యకలాపాలను విస్తరిస్తోంది. హైదరాబాద్ లోనూ ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.