Telangana Govt: సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచనతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వర్షాలు, వరదల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. మాన్‌సూన్ ఎమర్జెన్సీ బృందాలు 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. నీరు నిలిచిపోయే అవకాశమున్న ప్రాంతాల్లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ పనులను వేగవంతం చేయాలన్నారు.
జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసంలో కీలక విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాలు, వరదలపై అధికారులకు కీలక సూచనలు చేశారు. వర్షాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.
ముఖ్యంగా వర్షాలు పడినప్పుడు సిటీలో ట్రాఫిక్, వర్షం నీరు రోడ్లపైకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ తరహా సమస్యలు తలెత్తకుండా ఉండేలా పోలీసులు, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్‌ఎంసీ విభాగాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయా విభాగాల అధికారులు సమన్వయంతో చేయాలన్నారు. దీనివల్ల సమస్యలు రావాలని తేల్చిచెప్పారు.
ఇప్పటికే గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్‌లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు సీఎం. హార్వెస్టింగ్ వెల్స్‌లోకి వచ్చే వర్షపు నీటిని ఆటోమేటిక్ పంపులతో పంపించేలా చర్యలు చేపట్టాలన్నారు. అసంపూర్తిగా ఉన్న నాలాల పూడికతీత పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు.
ALSO READ: తెలంగాణకు ఉరుముల వర్షం.. ఆ జిల్లాలకు ముందస్తు హెచ్చరిక
వర్షాల సమయంలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ ముందస్తు చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ముఖ్యంగా కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని చెరువులు, నాలాలు, రోడ్ల విస్తరణ, అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక పాలసీని తయారు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు ముఖ్యమంత్రి.
వాతావరణ శాఖ సూచనలను అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ అధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్, హెచ్ఎండీఏ ముఖ్య విభాగాల అధికారులు హాజరయ్యారు.