CM Revanth Reddy: గత వారం రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి జపాన్ లో బిజి బిజీగా పర్యటించారు. సీఎం నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటనను నేటితో విజయవంతంగా ముగించింది. ఈ పర్యటన ద్వారా తెలంగాణకు భారీ స్థాయిలో పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో మొత్తం రూ.12,062 కోట్ల విలువైన పెట్టుబడులు, దాదాపు 30వేలకు పైగా ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నిల్ వచ్చింది. ఈ వారం రోజులు సీఎం రేవంత్ బృందం ఏ సాధించిందో చూద్దాం.
ముఖ్యమైన ఒప్పందాలు..
తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలక పెట్టుబడి ఒప్పందాలను కుదుర్చుకుంది. జపాన్‌కు చెందిన వ్యాపార దిగ్గజం మరుబెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు మరుబెనీ ఓకే చెప్పింది. మరుబెనీ కంపెనీ మొదట రూ.1000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో దశల వారీగా ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. దీని ద్వారా 5 వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించే అంచనా ఉంది. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటయ్యే ఈ పార్క్ తో తెలంగాణలో సుమారు 30 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభించే ఛాన్సెస్ ఉన్నాయి. మరుబెనీ ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో 410కి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
రూ.10,500 కోట్లతో కీలక ఒప్పందం..
హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఎన్‌టీటీ డేటా, నెయిసాతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా దాదాపు రూ.10,500 కోట్లతో కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. అలాగే రేవంత్ సర్కార్ మరో కంపెనీతో కీలక ఒప్పందం చేసుకుంది. రుద్రారంలో విద్యుత్ పరికరాల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు తోషిబా ట్రాన్స్ మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా (టీటీడీఐ) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా కంపెనీ రూ.562 కోట్ల రూపాయలతో ప్రాజెక్టును చేపట్టనుంది.
Also Read: Japan : రేవంత్ అంటే ఎంత ఇష్టమో.. జపాన్‌లో సర్‌ప్రైజ్ గిఫ్ట్.. సీఎం ఫిదా..
500 మందికి ఉద్యోగ అవకాశాలు..
జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మరో కంపెనీతో ఉద్యోగ నియామకాలకు సంబంధించి కీలక ఒప్పందం కుదుర్చుకుంది. జపాన్‌లో 500 ఉద్యోగ నియామకాలకు టామ్‌కామ్, టెర్న్, రాజ్ గ్రూప్ సంస్థల (TOMCOM-Turn-Raj Group) మధ్య కీలక ఒప్పందం కుదిరింది.
జపాన్ పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం రేపు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానుంది. హైదరాబాద్ కు వచ్చాక సీఎం నేరుగా సంగారెడ్డికి వెళ్లనున్నారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కుమార్తె ఎంగేజ్‌మెంట్ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరుకానున్నారు.