Hyderabad: హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో బ్యాక్ బెంచ్ సీటింగ్ విధానాన్ని రద్దు చేసి.. యూ (U) షేప్ ఆకారంలో కూర్చునే విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. బ్యాక్ బెంచీలను తొలగించడం వల్ల తరగతి గదిలో విద్యార్థులందరూ సమానంగా పాల్గొనేలా చూడాలన్నది ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశ్యమని ఆమె చెప్పారు. సికింద్రాబాద్, బౌవెన్‌పల్లిలోని ట్రైబల్ వెల్ఫేర్ వాటర్ స్పోర్ట్స్ అకాడమీ, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ బాయ్స్ స్కూల్‌ను సందర్శించిన సందర్భంలో ఆమె ఈ సూచనలు చేశారు.
‘స్థానార్థి శ్రీకుట్టన్’ అనే మలయాళ సినిమా చూసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. వెనుక బెంచీల్లో కూర్చునే విద్యార్థులు తరగతిలో సరిగా క్లాసెస్ వినకపోవచ్చని.. ఈ కొత్త సీటింగ్ విధానం వల్ల ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థితో నేరుగా సంభాషించవచ్చని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల పిల్లలు చదువులో వెనుకబడకుండా, అందరితో సమానంగా ముందుకు సాగేలా ఈ సీటింగ్ విధానం తోడ్పడనుందని ఆమె చెప్పారు. బ్యాక్ బెంచ్ సీటింగ్ విధానం వల్ల వెనుక వరుసల్లో కూర్చునే విద్యార్థులు తరచూ టీచర్లకు దూరంగా ఉండి, తక్కువ శ్రద్ధ పొందుతారని, ఇది వారి నేర్చుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని కలెక్టర్ హరిచందన వివరించారు.
ALSO READ: Skeleton Found: హైదరాబాద్‌లో అస్థిపంజరం ఘటన.. ఎట్టకేలకు వీడిన మిస్టరీ.. ఎవరిదంటే?
“U” ఆకార సీటింగ్ విధానం ద్వారా టీచర్లు తమ దృష్టిని అన్ని విద్యార్థులపై సమానంగా నిలిపి, ప్రతి ఒక్కరూ తరగతి కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేలా చేస్తుందని చెప్పారు. ఈ విధానం ముఖ్యంగా సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఏర్పాటు విద్యార్థుల మధ్య సమానత్వ భావనను పెంపొందించడమే కాక, ఉపాధ్యాయులతో సన్నిహిత సంబంధాన్ని ప్రోత్సహిస్తుందని అన్నారు.
ALSO READ: Viral video: నడిరోడ్డుపై జుట్లు పట్టుకుని పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, క్రీడా శిక్షణ, డిజిటల్ తరగతి గదులను కూడా కలెక్టర్ పరిశీలించారు. క్రీడలను కూడా చదువులో భాగంగా చేసి, విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు గణితం, భౌతిక శాస్త్రంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, T-SAT ప్లాట్‌ఫాంను ఉపయోగించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.