NEET Protests: స్వేచ్చ బ్యూరో: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ అంశంలో కేంద్ర మంత్రి.. తమ పార్టీ ప్రెజర్‌తోనే రాజీనామా చేశారని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నది. కేంద్రంలో ఆధిపత్యం చలాయిస్తున్న బీజేపీ సర్కార్‌కు తమ ఒత్తిడితోనే గొంతులో వెలక్కాయ పడిందని హస్తం పేర్కొంటుంది. దేశంలో ప్రతిపక్ష పార్టీ గా తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించినట్లు చెబుతున్నది. ఢిల్లీ ధర్నా తర్వాత సెంట్రల్ మినిస్టర్ రిజైన్ ఎపిసోడ్ ను కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మలుచుకోవడంలో సఫలమైందనే చర్చ ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో నడుస్తోంది.
విద్యార్థుల ఆగ్రహం, దేశవ్యాప్త నిరసనలతో కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి రావడం కాంగ్రెస్ వర్గాల్లో కొత్త ఊపిరి పోసింది. ఈ విజయాన్ని పూర్తిస్థాయిలో తమ ఖాతాలోనే వేసుకుంటూ, దేశవ్యాప్తంగా మరింత చొరవగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు హస్తం పార్టీ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. వాస్తవానికి నీట్ పరీక్షలో జరిగిన గోల్‌మాల్‌పై విద్యార్థులు, యువజన సంఘాలు ఆందోళన బాట పట్టడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని పార్లమెంట్ లోపల, వెలుపల తీవ్రస్థాయిలో లేవనెత్తింది. వరుస నిరసనలు, ఒత్తిళ్ల నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజీనామా చేయడం ప్రతిపక్షానికి ఊహించని రాజకీయ మైలేజ్‌ను అందించింది. తమ పోరాటం వల్లే కేంద్రం దిగొచ్చిందని, బాధ్యులపై చర్యలకు శ్రీకారం చుట్టిందని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు, అభ్యర్థులు చేపట్టిన ధర్నాను కాంగ్రెస్ పార్టీ నైపుణ్యంగా ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఏఐసీసీ అగ్రనేతలు నేరుగా విద్యార్థుల నిరసనలకు మద్దతుగా నిలవడం, వారి గొంతును జాతీయ స్థాయి మీడియా ముందుకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఇది కేవలం విద్యార్థుల ఉద్యమంగా మాత్రమే కాకుండా, కాంగ్రెస్ నాయకత్వంలో జరుగుతున్న పోరాటంగా ముద్ర పడేలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.
Also read: Medchal: మేడ్చల్ బస్టాండ్‌కి వెళ్లాలంటే ముక్కు మూయాల్సిందే.. ఎందుకో తెలుసా..!
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సీఎంలు కూడా కేంద్రం పై ఒత్తిడి తెచ్చేందుకు నిరసనలు వ్యక్తంచేశారు. ఆయా రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కేడర్, ఎన్ ఎస్ యూఐ విద్యార్ధి విభాగాలు, పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ నీట్ పై రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశాయి. దీంతో కేంద్రం దిగి వచ్చిందనే చర్చ జరుగుతుంది. ఇక విపక్షాల డిమాండ్లకు కేంద్రం లొంగిపోవడంతో ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి తెలంగాణలోని గాంధీభవన్ వరకు కాంగ్రెస్ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. పటాకులు కాల్చి, తీపి పదార్థాలు పంచుకుంటూ గాంధీభవన్‌లో ఘనంగా సెలబ్రేషన్స్ నిర్వహించారు.”యువత, విద్యార్థుల వైపు నిలబడింది ఒక్క కాంగ్రెస్ మాత్రమే” అని నినదిస్తూ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు.
నీట్ వివాదంలో సాధించిన ఈ విజయాన్ని ఇక్కడితోనే ఆపేయకూడదని హస్తం అధిష్టానం భావిస్తోంది. వచ్చే ఎన్నికలు, రాష్ట్రాల అసెంబ్లీ పోరును దృష్టిలో ఉంచుకుని యువతను తమవైపు తిప్పుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. నిరుద్యోగం, పోటీ పరీక్షల లీకేజీలు, విద్యావ్యవస్థలో అక్రమాలపై దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ నిరసనలు చేపట్టాని అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నది. ఇక మోదీ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తున్నది.
అంతేగాక దేశంలోని కోట్ల మంది యువత మరియు విద్యార్థుల మద్దతును కాంగ్రెస్ వైపు మళ్లించుకోవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్లాలని భావిస్తున్నారు. ఓవరల్ గా నీట్ పేపర్ లీక్ ఉద్యమాన్ని కేవలం ఒక విద్యార్థి సమస్యగానే కాకుండా, కేంద్రంలోని అధికార పార్టీ విఫలమైందనే దానికి నిదర్శనంగా మార్చడంలో కాంగ్రెస్ సఫలమైంది. జంతర్ మంతర్ నుంచి గాంధీభవన్ వరకు కనిపిస్తున్న ఈ ‘జోష్’ రాబోయే రోజుల్లో ఏ స్థాయి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందోనని పొలిటికల్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతుంది.
Also read: తెలంగాణ బీజేపీలో మార్పుల పర్వం.. త్వరలోనే కొత్త అధ్యక్షుల నియామకం?