Speaker Remarks: స్వేచ్ఛ బ్యూరో: అసెంబ్లీ వేదికగా స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, అవమానకర రీతిలో వ్యవహరించడం బీఆర్‌ఎస్ నాయకుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్పీకర్‌ను అవమానించేలా వ్యవహరించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మధు, నవీన్‌రెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శామీర్‌పేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు.
అసెంబ్లీలో బీఆర్‌ఎస్ నేతలు కావాలనే రచ్చకు దిగారని ఆరోపించారు. ఒక రోజు ముందే కేసీఆర్ పిలిపించుకొని కొందరిని అసెంబ్లీలో గందరగోళం సృష్టించేందుకు పంపించారని ఆరోపించారు. ప్రజలంతా ఈ పరిణామాలను గమనిస్తున్నారని, బీఆర్‌ఎస్ రాజకీయాలకు ప్రజలే త్వరలో బుద్ధి చెబుతారని అన్నారు. గతంలో దళితుడిని రాజయ్య కేసీఆర్ పదవి నుంచి భర్తరఫ్ చేశారని గుర్తుచేస్తూ అలాగే కొప్పుల ఈశ్వర్‌ను అవమాన పరచాలని.. ఇప్పుడు కూడా దళితుడు స్పీకర్‌ను అవమానించిన కేసీఆర్ దొర అహంకారానికి నిదర్శనం అని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుడికి స్పీకర్ పదవి, దళితుడికి ఉప ముఖ్యమంత్రి పదవి కల్పించి సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందన్నారు.‘‘దళితులను అణిచివేసే రాజకీయాలకు కాలం చెల్లింది. వారి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు’’ అని మహేష్‌గౌడ్ హెచ్చరించారు. దళితుల కోసం పోరాడుతున్న పార్టీ కాంగ్రెస్ అని, కులమతాలకు అతీతంగా ప్రతి వర్గం ఆత్మగౌరవం కోసం పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ వ్యవస్థను అవమానించడమేనన్నారు. దళిత బిడ్డకు రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా ఉన్నత స్థానం దక్కడం బీఆర్‌ఎస్ నేతలకు జీర్ణించుకోవడం లేదని విమర్శించారు. స్పీకర్‌పై వ్యాఖ్యలకు నిరసనగా కేసీఆర్ ఫామ్ హౌస్ దళితులు డప్పులతో నిరసన తెలిపితే బీఆర్‌ఎస్ నేతలు పసుపు నీళ్లతో ఫామ్ హౌస్ శుద్ధి చేయడం దళిత సమాజాన్ని అవమానించే చర్యగా అభివర్ణించారు.‘‘రాజకీయంగా విభేదించవచ్చు.. కానీ రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని అనుచిత వ్యాఖ్యలు తో కించపరచడం ఏ సంస్కృతి?’’ అని ప్రశ్నించారు.
Also read: ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్
అసెంబ్లీకి బ్లాక్ టీషర్టులు ధరించి, వాటిపై అనుచిత వ్యాఖ్యలు రాసుకొని రావడం బీఆర్‌ఎస్ నాయకుల రాజకీయ స్థాయిని బయటపెట్టిందన్నారు. ‘‘మీ సంస్కృతి ఏంటి? సభ్య సమాజం తలదించుకునేలా ఎందుకు వ్యవహరిస్తున్నారు?’’ అంటూ బీఆర్‌ఎస్ నేతలను ప్రశ్నించారు. స్పీకర్ కేవలం దళితుడు కాదని, రాష్ట్ర శాసనసభకు స్పీకర్ అని గుర్తుంచుకోవాలని సూచించారు. పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. దళితులను అవమానించేలా వ్యవహరించినందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దళిత సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్‌లోని దళిత నాయకులు, కార్యకర్తలు కూడా ఈ ఘటనపై తమ వైఖరిని స్పష్టం చేయాలని కోరారు.
ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాల్సిన ప్రతిపక్ష నేతలు వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలకు దిగడం దురదృష్టకరమన్నారు. చిత్తశుద్ధి ఉంటే ప్రజల సమస్యలపై మాట్లాడాలని, రాజకీయ కక్షలతో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌ను అవమానించడం సరికాదన్నారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధు, నవీన్‌రెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో హరి, కృష్ణారెడ్డి, నవీన్‌రెడ్డి, బి.పి.టి. రాజు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Also read: బిడ్డకు ఆకలి వేసిందో లేదో ఎలా తెలుసుకోవాలి? తల్లిదండ్రులకు రెస్పాన్సివ్ ఫీడింగ్ గైడ్