Minister Komatireddy; స్వుఛ్చ బ్యూరో: మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని మూడు చింతలపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగింది. రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ నేతృత్వంలో నిర్వహించిన బహిరంగ సభల్లో మంత్రి, చీఫ్ విప్‌లు ప్రసంగించారు.
పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌కు మూడు చింతలపల్లి సమస్యలు ఎందుకు పట్టలేదని మంత్రి ప్రశ్నించారు. పేదల కోసం సన్న బియ్యం ఇవ్వాలని, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని అప్పట్లో ఎందుకు ఆలోచించలేదని విమర్శించారు. గత ప్రభుత్వ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, పేదల కోసం ఒక్కసారైనా ఆలోచన చేశారా అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పదేళ్లు అధికారంలో ఉండి పేదవాడికి చేయూత ఇవ్వలేని ప్రభుత్వం ఇప్పుడు మాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. తాము కేసీఆర్ లాగా గ్రామాలను దత్తత తీసుకొని మభ్యపెట్టమని ఆ గ్రామాలని అభివృద్ధి చేసి చూపిస్తామని మంత్రి అన్నారు. ఎమ్మెల్యేగా మల్లారెడ్డి దోచుకున్న సంపద ప్రజలకు తిరిగి రావాలంటే ఎన్నికలే మార్గమని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ప్రజలను కోరారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తోందన్నారు. ఎంసీ పల్లి మున్సిపాలిటీలో చైర్మన్‌తో పాటు అన్ని కౌన్సిలర్ స్థానాలు కాంగ్రెస్‌వే అవుతాయని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పేద ప్రజల గుండెల్లో అన్ని సంక్షేమ పథకాలు చేరాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ ఎన్నికల్లో మూడు మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని, గతంలో ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని, ఇప్పుడు పేదల కోసమే కాంగ్రెస్‌కు ఓటు వేయాలన్నారు.ఈ ఎన్నికల్లో ఓడిపోతే పదవులు పోతాయని భయపడేది బీఆర్ఎస్ మాత్రమేనని, కాంగ్రెస్‌కు పేద ప్రజలే అసలు బలమని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్‌లకు వెళ్లేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా పేదల సమస్యలు పట్టించుకోలేదని మండిపడ్డారు.
Also Read: TGERC Rules: రైతులకు రూ. 45 వేల భారం తప్పింది.. విద్యుత్ కనెక్షన్లపై భారీ మార్పులు..
పైసలతో రాజకీయం చేయడం కాంగ్రెస్ సంస్కృతి కాదని, అభివృద్ధి చేసి చూపించడమే తమ లక్ష్యమన్నారు. మొత్తం మూడు మున్సిపాలిటీల్లో ప్రతి మున్సిపాలిటీకి రూ.50 కోట్ల వరకు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. డ్రైనేజీ, కన్జర్వేషన్, రోడ్లు, తాగునీరు వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చేస్తామని తెలిపారు.ఎంసీ పల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ చైర్మన్ అవుతాడని, ఒక్క వార్డు కూడా కోల్పోమని స్పష్టం చేశారు. పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని వాళ్లు ఇప్పుడు హామీలతో మోసం చేయలేరన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతామని ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీల అమలుతో మహిళలు, నిరుపేదలు లక్షలాది మంది లబ్ధి పొందారని తెలిపారు.కొత్త రేషన్ కార్డులు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కే వంటగ్యాస్, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలను నిరుపేదలకు అందించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. సీఎం నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా సాగుతోందన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుస్తున్నాయని అన్నారు. ప్రజల ఆశీర్వాదాలతో మేడ్చల్ నియోజకవర్గంలోని అన్ని మూడు చింతలపల్లి,అలియా బాద్,ఎల్లంపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మాజీ జిల్లా డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్, మాజీ మేయర్ తోటకూర అజయ్, కొలన్ హన్మంత్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్,ముడిచింతల పల్లి మున్సిపల్ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్, అలియాబాద్ మున్సిపల్ అధ్యక్షుడు రమేష్ కాంగ్రెస్ నాయకులు జైపాల్ రెడ్డి , పిసరి మహిపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి , కృష్ణ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.
Also Read: Kalki 2: దీపికా స్థానంలో సాయి పల్లవి.. నిర్మాతలకు అన్ని కోట్లు లాభమా..వామ్మో?