Hotel Room Photos: పర్యాటక ప్రాంతాలకు వెళ్లినప్పుడు హోటల్ గదిలో బస తప్పనిసరి. అయితే లోపల అడుగుపెట్టగానే చాలా మంది గది శుభ్రంగా ఉందా, సువాసన వస్తుందా అని మాత్రమే చూస్తుంటారు. కానీ కొంచెం నిశితంగా గమనిస్తే డెస్క్ మీద చిన్న గీతలు, గోడపై మురికి మరక, వాడేసినట్లు అనిపించే మినీబార్, ఆకర్షణకోసం పెట్టిన వస్తువులల్లో పగుళ్లు కనిపిస్తాయి. అయితే ఇవి చాలామందికి పెద్ద సమస్యగా అనిపించకపోవచ్చు. కానీ ఇలాంటి పరిస్థితులు మీరు దిగిన హోటల్ గదిలోనూ ఉంటే తప్పకుండా ఫొటోలు తీసి భద్రపరచాలి. ఇలా ఎందుకు చేయాలో ఈ కథనంలో చూద్దాం.
చాలామంది హోటల్ స్టేలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ముగిసిపోతాయి. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం వివాదాలు ఎదురు కావొచ్చు. మనం చేయని నష్టానికి బిల్లు వేయడం, వస్తువులు పోయాయని అనడం, వాడని మినీబార్ ఉత్పత్తులకు డబ్బులు అడగడం వంటివి జరిగితే మాటల యుద్ధం మొదలవుతుంది. అందుకే చెక్ ఇన్ అయిన వెంటనే ఫోటోలు తీయడం చాలా ముఖ్యం. ఇవి మీరు అడుగుపెట్టినప్పుడు గది ఎలా ఉందో స్పష్టంగా చూపుతాయి. క్లెయిమ్‌లు, ఇన్సూరెన్స్ సమయంలో ఇవే బలమైన ఆధారాలుగా నిలుస్తాయి.
ఈ ఫోటోలు అందంగా, హెచ్‌డీ క్వాలిటీతో ఉండాల్సిన అవసరం లేదు. మీరు రూమ్‌లోకి వచ్చిన మొదటి కొన్ని నిమిషాల్లోనే తీశారా? లేదా? అనేదే ముఖ్యం. ఈ క్రమంలో ఫోన్ ఇమేజ్ డిటైల్స్‌లో ఉండే సమయం (Timestamp) చాలా కీలకంగా మారుతుంది. గది మొత్తాన్ని కవర్ చేస్తూ రెండు వైడ్ షాట్లు, బాత్‌రూమ్‌ను కవర్ చేసేలా ఒక చిన్న వీడియో, ఆల్రెడీ పగుళ్లు, గీతలు ఉన్న చోట కొన్ని క్లోజప్ ఫోటోలు తీస్తే సరిపోతుంది. ఇది తాము చేయలేదు? తాము రాకముందే ఇలా ఉంది? అని చెప్పడానికి ఇవే తిరుగులేని ఆధారాలుగా మారతాయి.
ఫొటోలతో పాటు గదిలోకి రాగానే ఒక చిన్న వీడియో తీయడం ఇంకా మంచిది. నెమ్మదిగా నడుస్తూ రూమ్‌ను, బాత్‌రూమ్ తలుపు తీసి, మినీబార్ షెల్ఫ్‌లను రికార్డ్ చేయండి. ఎడిటింగ్ లేదా ఫిల్టర్లు వాడకుండా ఒరిజినల్ ఫోటోలను ఉంచండి. వీటిని ఒక ప్రత్యేక ఫోల్డర్‌లో సేవ్ చేసి, హోటల్ వైఫై ఉన్నప్పుడే క్లౌడ్‌లోకి అప్‌లోడ్ చేయడం మంచిది. దీనివల్ల ఫోన్ పోయినా లేదా పాడైనా డేటా భద్రంగా ఉంటుంది.
చాలామంది కేవలం బెడ్, బాత్‌రూమ్ ఫోటోలతో సరిపెడతారు. కానీ సీలింగ్ వైపు కూడా చూడాలి. అక్కడ లీకేజీలు, మరకలు ఉంటే ఫోటో తీయాలి. స్మోక్ డిటెక్టర్లు, అందుబాటులో ఉన్న టవళ్లు స్పష్టంగా కనిపించేలా ఫోటోలు తీయాలి. వార్డ్‌రోబ్‌లు, కిటికీలు, వాటి లాక్‌లు సరిగా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసి వీడియో తీయడం వల్ల ఎలాంటి వివాదాలకైనా ముందే చెక్ పెట్టవచ్చు.
Also Read: చిన్న రూమ్.. తక్కువ బడ్జెట్.. రూ. 10,000 లోపే లభించే టాప్-5 మినీ ఫ్రిడ్జ్‌లు!
మీరు గది ఖాళీ చేసి వెళ్లేటప్పుడు (చెక్-అవుట్) కూడా కొన్ని ఫోటోలు తీయండి. మొదట ఏ కోణాల్లో తీశారో, ఇప్పడూ అదే యాంగిల్స్‌లో ఫోటోలు తీస్తే ‘బిఫోర్ – ఆఫ్టర్’ ప్రూఫ్ రెడీగా ఉన్నట్లు అవుతుంది. ఈ ఫోటోలను ప్రయాణం పూర్తయ్యాక కొద్ది వారాల పాటు ఫోన్‌లో ఉంచుకుని ఎలాంటి బిల్లింగ్ సమస్యలు రాకపోతే డిలీట్ చేసుకోవచ్చు. చాలాసార్లు ఈ ఫోటోల అవసరం రాకపోవచ్చు కానీ అవసరమైన వేళ ఇవే మిమ్మల్ని ఆర్థిక నష్టాల నుంచి, మానసిక ఆందోళన నుంచి కాపాడతాయి.
Also Read: జియో యూజర్లకు పండగే పండగ.. ఏడాది పాటు ఫ్రీగా అమెజాన్ ప్రైమ్.. 18 నెలల గూగుల్ జెమిని ప్రో!