రాబోయే మున్సిపల్ ఎన్నికలు అధికార పార్టీకి సవాల్‌గా మారునున్నట్టు తెలుస్తున్నది. ఇదేదో ప్రజల నుంచి వ్యతిరేకత వల్లేనా అని కాదు. ఇది పార్టీలోని అంతర్గత వ్యవహారం. మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి చాలా మంది ఆశావహులు సిద్ధంగా ఉన్నారు.తమకు ఒక్క చాన్స్ ఇవ్వాలని మంత్రులు, ఎమ్మెల్యేల వెంట పడుతున్నట్టు సమాచారం. దీనికి తోడు గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు సైతం తమ అనుచరులకు చాన్స్ ఇవ్వాలని కోరుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఫలితంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వారు తమకు అన్యాయం జరుగుతుందని అధిష్టానం వద్ద వాపోయినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ చాన్స్ ఇవ్వకపోతే రెబల్‌గా నిలబడతామని చెబుతున్నట్టు సైతం కథనాలు వస్తున్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలతో పాటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ బైపోల్ సమయంలోనూ ఈ రెండు పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించాయి. సర్పంచ్ ఎన్నికల్లో మిత్రపక్షంగా సీట్లు ఆశించగా.. తమకు కాంగ్రెస్ పెద్దగా అవకాశం ఇవ్వలేదని వారు నిరాశలో ఉన్నట్టు తెలుస్తున్నది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా తమకు మిత్రపక్షంగా న్యాయం చేయాలని కోరేందుకు తెలంగాణ జనసమితి, సీపీఐ పార్టీలు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం జిల్లాలో సీపీఐ మున్సిపల్, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ పోస్టులను ఆశిస్తున్నట్టు సమాచారం.ఇక తెలంగాణ జనసమితి ఉత్తర తెలంగాణలోనూ మున్సిపల్, జెడ్పీటీసీ, జైడ్పీచైర్మన్ పోస్టులను ఆశిస్తున్నట్టు టాక్.
గత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అభయం దక్కకపోవడంతో రెబల్స్‌గా పోటీ చేసి చాలా మంది గెలిచారు. ఫలితంగా కాంగ్రెస్‌కు అనుకున్న మేర సర్పంచ్ సీట్లు దక్కలేదు. రెబల్స్ వల్లే ప్రత్యర్థి పార్టీలు, పలుచోట్ల ఇండిపెండెంట్లు గెలిచారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ గత తప్పిదం రిపీట్ కాకుండా ఉండేందుకు అధికార కాంగ్రెస్ పకడ్భందీగా ముందుకు వెళ్తున్నట్టు సమాచారం.ఈసారి జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలకు రెబల్స్‌ను బుజ్జగించే బాధ్యతలను అప్పగించారు. సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన పొరపాటు మళ్లీ జరగరాదని సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ వారికి స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది.
Tdp vs ysrcp : వెల్‌కమ్ టు ఏపీ.. టీడీపీ vs వైసీపీ డైలాగ్ వార్
బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లడంతో పాటు పార్టీలోని అసంతృప్తులను కూల్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ముందుగా పార్టీలో అంతా కరెక్టుగా ఉంటే ఎన్నికల్లో విజయం నల్లేరు మీద నడకే అవుతుందని సీఎం రేవంత్ మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్టు పార్టీలో చర్చ జరుగుతున్నది.ఈ క్రమంలోనే వలస నేతలు,కంటెస్టెడ్ నేతల మధ్య విభేదాల సయోధ్యకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగి వారితో చర్చించి ఓ పరిష్కారం చూపనున్నట్టు పార్టీలో టాక్ వినిపిస్తున్నది. అలాగే మిత్రపక్షం కోరినన్ని కాకుండా ఎంతో కొంత వారిని సైతం సంతృప్తి పరచాలని.. లేదంటే కాంగ్రెస్ పార్టీలోని ఆశావహుల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది.