DK Aruna: స్వేచ్ఛ బ్యూరో: డిండి నుంచి నల్లగొండ జిల్లాకు నీటి తరలింపు ఆపాలని, పాలమూరు రైతుల ప్రయోజనాలు కాపాడాలని పాలమూరు ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం రైతులు, జేఏసీ నాయకులు చేపట్టిన పాదయాత్ర ఉల్పర నుంచి కల్వకుర్తి వరకు 20 కిలో మీటర్లు సాగింది. పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి ఎంపీ డీకే అరుణ హాజరై మాట్లాడారు.
పాలమూరు రైతుల కోసమే ఈ పోరాటం..
పాలమూరు ప్రాజెక్ట్ నుంచి 14 నియోజకవర్గాల్లోని వ్యవసాయ భూములకు సాగునీరు కావాలని ప్రాజెక్టులు సాధించుకుని తెచ్చుకున్నామని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో డిండి ద్వారా నల్లగొండ జిల్లాకు నీటి తరలింపు ఆపాలని రైతులు, అన్ని పార్టీల నాయకులు జేఏసీ గా ఏర్పాటు చేసి, పాదయాత్ర చేస్తున్నారన్నారు. అనేక పోరాటాలతో జిల్లాకు ప్రాజెక్టులు వచ్చినా.. ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి పూర్తి కాలేదని ఆమె పేర్కొన్నారు.
నల్లగొండకు సాగర్ నీళ్లే సరిపోతాయి..
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు ఉందన్నారు. డిండి లిఫ్ట్ ద్వారా నల్లగొండ జిల్లాకు నీళ్లు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. పాలమూరు జిల్లా రైతులు నీళ్ళు లేక దీన స్థితిలో ఉన్నారని, పదేళ్లు పాలించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా.. ప్రాజెక్టులు పూర్తిచేయలేదని మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను కుర్చీ వేసుకొని మరీ పూర్తి చేస్తామని కేసీఆర్ చెప్పి ఏమాత్రం చేయలేదని మండిపడ్డారు. నల్లగొండ ప్రజలు డిండి నీళ్లు కావాలని అడగలేదని, డిండి కంటే.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు నల్లగొండ తీసుకువెళ్ళవచ్చని ఆమె సూచించారు.
అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం..
డిండి నీళ్ళు తరలిపోతుంటే.. పాలమూరు రైతాంగం నష్టపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. పాలమూరు జిల్లా వ్యక్తి రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారని, డిండి ప్రాజెక్ట్ ఆపాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిపై ఉందని డీకే అరుణ వ్యాఖ్యానించారు. జిల్లా వ్యక్తే.. నష్టం చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. డిండి ప్రాజెక్ట్ కచ్చితంగా ఆపాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆపే వరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ రెండుగా విభజించి.. ప్రాజెక్ట్ – 1 నార్లపూర్ నుంచి నీటిని ఇవ్వాలని, ప్రాజెక్ట్ -2 జూరాల నుంచి నీటిని తీసుకొని మొదటి డీపీఆర్ ప్రకారం ఆ ప్రాంతానికి నీరు ఇవ్వాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. పాలమూరు రైతుల, ప్రజల భవిష్యత్ తరాలు బాగుండాలంటే.. ప్రాజెక్టులకు నిధులు ఇచ్చి సాగు నీరు ఇవ్వాలన్నారు. డిండి లిఫ్ట్ వెంటనే రద్దు చేయాలని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.
Also Read: ఆందోళన చేస్తే లాఠీలతో కొడతారా? గొంతు వినిపించడం నేరమా? సీఎం చంద్రబాబుపై జగన్ ఆగ్రహం