CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ టీమ్ జపాన్ లో పర్యటిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వారం రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో బిజీబిజీ షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ రైజింగ్ టీమ్ భారీగా పెట్టుబడులు రాబడుతోంది. జపాన్ దేశం నుంచి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని ప్రాంతాలను సందర్శిస్తోంది. జపాన్ దేశాన్ని చూసి ఏం నేర్చుకోవచ్చు.. మన రాష్ట్రానికి జపాన్ నుంచి ప్రేరణగా తీసుకునే అంశాలేమున్నాయి? అనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ఎంచుకున్నారు.
అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న సీఎం
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే జపాన్ దేశానికి సీఎం రేవంత్ రెడ్డి రైజింగ్ టీమ్ వెళ్లింది. ముఖ్యంగా హైదరాబాద్ మహా నగరంలో డెవలప్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనది మూసీ పునరుజ్జీవం. అన్ని ప్రధాన నగరాల్లో సిటీ మధ్యలో నుంచి నదులు చలా చక్కగా వెళ్తున్నాయి. అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో రివర్ ఫ్రంట్ లు, వాటర్ పార్క్ లు చాలా అద్భుతంగా ఉన్నాయి. మన దగ్గర మాత్రం మూసీ దగ్గరికి వెళ్తేనే కంపు కొట్టే పరిస్థితి నెలకొంది. సిటీ మధ్యలో దుర్గంధమైన వాసన నగర ప్రజలను చాలా ఇబ్బంది పెడుతోంది.
దేశ, విదేశీ పర్యాటకులు వస్తే ఒక మురికి కూపంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంటుంది. దీన్ని ఎలాగైనా బాగు చేద్దామని రేవంత్ సర్కార్ సంకల్పం తీసుకుంది. హైదరాబాద్ మహా నగర మధ్యలో ఫీల్ గుడ్ ఎన్విరాన్ మెంట్ ఉండేలా చర్యలు తీసుకుంటోంది. రేవంత్ ఏ దేశం పర్యటనకు వెళ్లినా ఇలాంటి నదులను పరిశీలించి వస్తున్నారు. గతంలో సియోల్, లండన్ లో ఎలా తీర్చిదిద్దారో పరిశీలించారు. ఈక్రమంలోనే హైదరాబాద్ లో కూడా ఎలాంటి దుర్గంధం లేకుండా మూసీ నది ప్రవహించేలా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు.
రేవంత్ సర్కార్ మరో కీలక ఒప్పందం..
ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి జపాన్ లో పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు కుదర్చుకుంటున్నారు. తాజాగా జపనీస్ ఎకో టౌన్ కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో ఎకో టౌన్‌ను స్థాపించడం లక్షంగా కీలక నిర్ణయం తీసుకుంది. రీసైక్లింగ్, మున్సిపల్ వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పునరుద్ధరణలో ప్రధాన సహకారం ఉండాలనే ఉద్దేశ్యంతో ఒప్పందం చేసుకోంది. అలాగే గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, మెట్రో రైలు, ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, మూసీ పునరుజ్జీవనంలో పెద్ద అవకాశాలు ఉన్నాయని జపాన్ సంస్థలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కిటాక్యుషు-హైదరాబాద్ సోదరి నగర హోదా గురించి ఇరుపక్షాలు చర్చించాయి.
హైదరాబాద్ మహానగరంలో జపనీస్ భాషా పాఠశాలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నగర మేయర్ టకేయుచ్‌ను సూచించారు. నైపుణ్యం కలిగిన, యువ కార్మికులు సహాయం చేయాలని సీఎం ను మేయర్ కోరారు. భవిష్యత్తు కోసం ఒక వారధిని నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.