PM POSHAN: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ఈనెల 15 నుంచి రీఓపెన్ అవ్వనున్నాయి. అందులో భాగంగా అదేరోజు నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని(పీఎం పోషణ్) పునఃప్రారంభించనున్నారు. 2026-27 విద్యాసంవత్సరంలో ఈ పథకాన్ని ఎటువంటి అంతరాయాలు లేకుండా, అత్యంత సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ప్రధానంగా రాష్ట్రంలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నాణ్యత, పర్యవేక్షణ పెంచేందుకు ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. అందులో మరీ ముఖ్యంగా ఎల్పీజీ కనెక్షన్లకు సంబంధించిన అంశాలపై ప్రస్తావించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 41 శాతం పాఠశాలల్లోనే ఎల్పీజీ గ్యాస్ వాడుతున్నట్లుగా విద్యాశాఖ చెబుతోంది. ఈనేపథ్యంలో సురక్షితమైన, పరిశుభ్రమైన వంట కోసం అన్ని పాఠశాలల్లో 100 శాతం గ్యాస్ కనెక్షన్లు వినియోగించేలా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని డీఈవోలను ఆదేశించింది. బొగ్గు, కట్టెల పొయ్యిల వల్ల వచ్చే పొగ ఆరోగ్యానికి హానికరం కాబట్టి, అన్ని పాఠశాలల్లో వంద శాతం ఎల్పీజీ కనెక్షన్ల ద్వారానే వంట జరిగేలా చూడాలని స్పష్టంచేసింది.
గతంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగిన నేపథ్యంలో అలాంటి ఇబ్బందులు పునరావృతం అవ్వకూడదనే ఉద్దేశ్యంతో మధ్యాహ్న భోజన అంశంపై స్పష్టమైన ఆదేశాలు పాటించాలని విద్యాశాఖ స్పష్టంచేసింది. ఈనెల 15న పాఠశాలలు రీఓపెన్ అవుతున్న నేపథ్యంలో ముందస్తు శానిటేషన్ చర్యలు తప్పనిసరి అని పేర్కొంది. పాఠశాలలు ప్రారంభమయ్యే లోపు వంట పాత్రలను శుభ్రం చేయడం, కిచెన్ షెడ్లు, వంట గదులకు సున్నాలు వేయడం, తాగునీరు మరియు వంటకు ఉపయోగించే ఓవర్ హెడ్ ట్యాంకులు, సంపులను శుభ్రపరచడం వంటి పనులను ముందస్తుగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.
Also read: BRS Strategy: రాష్ట్రంలో గులాబీ దళం సరికొత్త వ్యూహం.. టార్గెట్ 6 నెలలు..?
అలాగే నాణ్యమైన ఆహార దినుసులను ముందే సిద్ధం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు వారానికి మూడు రోజులు గుడ్లు, మిగిలిన రోజుల్లో రాగిజావను అందించే ప్రక్రియను యథావిధిగా కొనసాగించనున్నారు. గత విద్యాసంవత్సరంలో మధ్యాహ్న భోజన పథకం కింద సగటున 72 శాతం మంది విద్యార్థులు మాత్రమే భోజనం చేసినట్లు విద్యాశాఖ గుర్తించింది. ఈ ఏడాది అర్హులైన విద్యార్థులందరికీ 100 శాతం భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ డీఈవోలను ఆదేశించింది. అదేవిధంగా, పాఠశాలల్లో కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని పెంచేందుకు గుజరాత్ తరహాలో తిథి భోజనం(ప్రత్యేక సందర్భాల్లో సమాజం తరపున విందు ఇవ్వడం) కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని స్పష్టంచేశారు.
గతేడాది 60 శాతం పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేయగా, ఈ ఏడాది అన్ని పాఠశాలల్లో వ్యవసాయ, ఉద్యానవన శాఖల సహకారంతో వీటిని అభివృద్ధి చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆటోమేటెడ్ మానిటరింగ్ సిస్టమ్ మొబైల్ యాప్ ద్వారా ప్రతిరోజూ హాజరు, భోజన వివరాలను 100 శాతం నమోదు చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇకపోతే గతేడాది కేవలం 66.79 శాతం ఆహార నమూనాలను మాత్రమే పరీక్షించారని, ఈసారి ప్రతి జిల్లా నుంచి కనీసం 5 శాతం భోజన నమూనాలను సేకరించి ల్యాబ్‌లలో పరీక్షించాలని, వంట సిబ్బందికి పాఠశాలలు తెరిచే లోపే 100 శాతం ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
మధ్యాహ్న భోజన పథకం సమర్థవంతమైన అమలుపై జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన, మండల స్థాయిలో తహశీల్దార్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ సమావేశాలను నిరంతరం నిర్వహించి సమీక్షించాలని విద్యాశాఖ స్పష్టంచేసింది. జిల్లా స్థాయిలో మొత్తం 13 మంది కమిటీలో ఉండగా పర్యవేక్షణ కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండనుంది. ఈ కమిటీకి చైర్మన్ గా ఆయనే ఉంటారు. మండల స్థాయి స్టీరింగ్ కమిటీ 8 మందితో ఉంది. తహసీల్దార్ చైర్మన్ గా ఉంటారు. ఈ కమిటీ ప్రతినెలా కనీసం ఒకసారి సమావేశమై మండల పరిధిలోని పాఠశాలలను పర్యవేక్షించాలని విద్యాశాఖ స్పష్టంచేసింది.
Also Read: మహీంద్రా కార్లకు ఎందుకింత డిమాండ్? 5 బలమైన కారణాలు ఇవే!
మధ్యాహ్న భోజనం వండే సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. పాఠశాలలు పునఃప్రారంభం కావడానికి ముందే వంట సిబ్బంది అందరికీ 100% ఆరోగ్య పరీక్షలు పూర్తి చేయాలని స్పష్టంచేసింది. ఆహార తయారీలో ఆరోగ్యం, పరిశుభ్రతా ప్రమాణాలను పాటించడంపై వారికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొంది. విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు, వంటకు స్వచ్ఛమైన నీరు అందించడానికి పాఠశాలల్లోని ఓవర్‌హెడ్ ట్యాంకులు, సంపులను ముందే శుభ్రం చేయాలని వెల్లడించింది. ఇదిలా ఉండగా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన ఆహార నమూనాల పరీక్షలు, నివేదికల సమర్పణకు సంబంధించిన అంశాలపైనా విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
భోజన పోషక విలువలను గుర్తించేందుకు ల్యాబ్‌లలో పరీక్షించాలని, గతంలో కేవలం 66.79 శాతం నమూనాలు మాత్రమే పరీక్షించారని పేర్కొంది. అందుకే ఈ విద్యాసంవ్సరంలో జిల్లాలో కనీసం 5 శాతం నమూనాలు సేకరించి పరీక్షించాలని విద్యాశాఖ కొత్త లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈ ఫలితాల ఆధారంగా భోజన నాణ్యతను మెరుగుపరచాలని నిర్ణయానికి వచ్చింది. మధ్యాహ్న భోజన పథకంపై ఇంత పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్న సర్కార్, విద్యాశాఖ.. ఫుడ్ పాయిజన్ ఘటనలకు బ్రేక్ వేస్తుందా? లేదా? అనేది చూడాలి.
Also read: HYDRAA: హైదరాబాద్‌కు కొత్తగా మెట్ ఎమర్జెన్సీ టీమ్స్.. రంగంలోకి 51 బృందాలు..!