“వాడు సైకోనా, శాడిస్టా, మనిషా, పశువా.. వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడే నిర్ణయించుకోవాలి. బీ కేర్ ఫుల్ కొడకా.. మేం శత్రువులతో కొట్లాడతాం. కానీ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే సంస్కృతి నాకు లేదు కొడకా. సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా పైకి పంపిస్తా, ఇలాంటి వాటిని హైకమాండ్ అరికడుతుందని భావిస్తున్నా. అరికట్టలేకపోతే నష్టం మాకు కాదు.” శామీర్ పేటలోని తన నివాసంలో కార్యకర్తలు, తన అభిమానుల మధ్య ఈ వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ఆయన టార్గెట్ బండి సంజయ్ అని అంటున్నారు. ఇటీవల బండి సంజయ్ కూడా పరోక్షంగా ఈటల రాజేందర్ ని, ఆయన అనుచరుల్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాటికి ఈరోజు ఈటల మరింత ఘాటుగా బదులిచ్చారని చెబుతున్నారు.
ఎందుకీ గొడవ..?
ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గం హుజూరాబాద్. 2009 నుంచి 2021 బై ఎలక్షన్ వరకు వరుసగా అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి పదవి చేపట్టారు రాజేందర్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమిపాలైన తర్వాత ఆయన 2024 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి స్థానానికి వచ్చారు. అక్కడ ఎంపీగా గెలిచారు. అయితే హుజూరాబాద్ లో మాత్రం తన పట్టు నిలుపుకోడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు ఈటల. కానీ హుజూరాబాద్ పై బండి సంజయ్ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఆయన కరీంనగర్ ఎంపీ. కరీంనగర్ లోక్ సభ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హుజూరాబాద్ కూడా ఒకటి. 7 అసెంబ్లీల్లో ఒక్క చోట కూడా బీజేపీ గెలవకపోయినా, ఏడాది తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బండి కరీంనగర్ ఎంపీ అయ్యారు. కరీంనగర్ పై పట్టు నిలుపునే క్రమంలో హుజూరాబాద్ లో కూడా తన వర్గాన్ని బలోపేతం చేస్తూ వచ్చారు బండి. ఇది ఈటలకు నచ్చలేదు. మరోవైపు అక్కడ బీజేపీలో ఈటల వర్గం కూడా ఉంది. వారంతా బండికి వ్యతిరేకంగా గ్రూప్ కట్టారు.
ఈటల వర్గానికి ఉక్కపోత..
రాబోయే స్థానిక ఎన్నికల్లో హుజూరాబాద్ పరిధిలో ఈటల వర్గానికి అన్యాయం జరగబోతోందనే ప్రచారం తీవ్రమైంది. దీంతో ఈటల వర్గంలో ఇబ్బంది మొదలైంది. వారంతా గ్రూపుగా ఆయన వద్దకు వెళ్లారు. స్థానికంగా తమ మాట చెల్లుబాటు కావడం లేదని, బండి వర్గం తమని డామినేట్ చేస్తోందని, పార్టీలో పదవులు, నామినేటెడ్ పోస్ట్ లు కూడా వారికే వెళ్తున్నాయని చెప్పారు. ప్రస్తుతానికి మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్నా.. ఈటలకు తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ పై ప్రేమ తగ్గలేదు. అక్కడ తన వర్గాన్ని ప్రోత్సహిస్తూ వచ్చారాయన. వారంతా ఇబ్బందుల్లో ఉండేసరికి ఈటల కూడా బయటపడక తప్పలేదు.
ఇటీవల క్రిప్టో కరెన్సీ స్కామ్ కూడా ఈటల, బండి వర్గాల మధ్య దూరం మరింత పెంచింది. ఆ స్కామ్ లో ఇరుక్కున్న బీజేపీ నేతకు ఒకరు సపోర్ట్ చేస్తుండగా, మరొకరు వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఈ దశలో ఈటల వ్యాఖ్యలు మరింత హాట్ హాట్ గా మారాయి. ఆయన అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానంటున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో కూడా ఈటల అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ గొడవకు అధిష్టానం ఫుల్ స్టాప్ పెడుతుందో లేదో చూడాలి.