Telangana Govt: తెలంగాణలో కొందరు ఐపీఎస్‌ల వ్యవహారశైలిపై జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై కొందరు నేతలు ఓపెన్‌గా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అధికారులు సరిగా విధులు నిర్వహించలేదని, పార్ట్ టైమ్ మాత్రమే చేస్తున్నారని ఇంటబయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం జరుగుతుండగా మరోవైపు ఎనిమిది మంది ఐపీఎస్‌లకు స్థాన చలనం కలిగింది.
ఈ మేరకు అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో హైదరాబాద్ క్రైమ్స్ అదనపు కమిషనర్‌గా విశ్వప్రసాద్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా జోయల్ డేవిస్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా గజారావు భూపాల్‌ను ట్రాన్స్‌ఫర్ చేశారు. సీఐడీ ఎస్పీగా నవీన్‌కుమార్, గవర్నర్ ఏడీసీగా శ్రీకాంత్, సీఐడీ ఏడీసీగా రామ్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీధర్, హైదరాబాద్ ఎస్బీ డీసీపీగా చైతన్యకుమార్‌లను నియమించారు.
రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారులను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ ఆదేశాల జారీ చేసింది. రోడ్ సేఫ్టీ డీజీగా పని చేస్తున్న అంజనీకుమార్, రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డీజీ అభిలాష బిస్త్‌ను రిలీవ్ చేసింది ప్రభుత్వం.
తక్షణమే ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున కరీంనగర్ సీపీ అభిషేక్ మొహంతి రిలీవింగ్‌పై ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం లేఖ రాసింది. ఈసీ నిర్ణయంపై ఆయన రిలీవింగ్ ఆధారపడి ఉంది. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి కేటాయించిన కొందరు అధికారులు క్యాట్ ఉత్తర్వుల మేరకు తెలంగాణాలోనే పని చేస్తున్నారు.
ALSO READ: యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి
కొత్త జిల్లాలు నేపథ్యంలో తమకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేటాయించాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారుల కొరత వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయని వివరించింది. ఈ క్రమంలో కొందర్ని కేటాయించింది. అయితే ఏపీ విభజన సమయంలో చాలామంది అధికారులు తెలంగాణలో ఉండిపోయారు. న్యాయస్థానాల ఆదేశాలతో తెలంగాణ నుంచి వారంతా ఇప్పుడు రిలీవ్ అవుతున్నారు. మొన్నటికి మొన్న ఐఏఎస్ అధికారుల వంతు కాగా.. ఇప్పుడు ఐపీఎస్ అధికారుల వంతైంది.