CM Revanth Reddy: తెలంగాణ ఉద్యమంలో అంకితభావంతో సేవలందించిన దివంగత లింగాల కేదారి, ఆయన భార్య పుష్పలత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. సీఎం సహాయ నిధి నుంచి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మలిదశ ఉద్యమ సమయంలో లింగాల కేదారి, పుష్పలత అంకితభావంతో అందించిన సేవలను ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేసుకున్నారు.
రేవంత్ రెడ్డి ఆదేశాలను ఎక్స్ వేదికగా సీఎంఓ కార్యాలయం తెలియజేసింది. కేదారి దంపతులు సాధారణ హోటల్ నడుపుతూ మలిదశ ఉద్యమ సమయంలో ఉచితంగా భోజనం, టిఫిన్లు, టీలు అందించారని తెలియజేసింది. హనుమకొండకు చెందిన లింగాల కేదారి, ఆయన భార్య పుష్పలత ఈ నెల 9, 10 తేదీల్లో మరణించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి సీఎంఆర్ఎఫ్ నుంచి సీఎం ఓఎస్డీ రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. మంజూరైన ఆర్థిక సాయాన్ని అర్హులైన కుటుంబ సభ్యులకు అందించేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్‌ను ఆదేశించారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో అంకితభావంతో సేవలందించిన దివంగత లింగాల కేదారి, ఆయన భార్య దివంగత శ్రీమతి పుష్పలత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (#CMRF) నుంచి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు.
✅తెలంగాణ మలిదశ ఉద్యమ… pic.twitter.com/iFdvcHhxDf
— Telangana CMO (@TelanganaCMO) September 21, 2026
మరోవైపు ఉద్యమ సమయంలో అదృశ్యమైన మండల రాజు కుటుంబానికి సైతం సీఎం రేవంత్ అండగా నిలిచారు. మానవతా దృక్పథంతో రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన మండల సమ్మిరెడ్డి కుమారుడు మండల రాజు (34).. 2013 జూన్ 20వ తేదీన అదృశ్యమయ్యాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విజ్ఞప్తి మేరకు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని సీఎం ఆదేశించారు.
Also Read: ఖాతాల్లో రూ.813 కోట్లు పెట్టుకుని ఏం చేస్తున్నారు? కలెక్టర్లపై మంత్రి ఉత్తమ్ ఫైర్!
అంతకుముందు సీఎంకు రాసిన లేఖలో మండల రాజుకు సంబంధించిన విషయాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమంలో మండల రాజు చురుకుగా పాల్గొన్నారని ఈ క్రమంలో అరెస్టై చర్లపల్లి కేంద్ర కారాగారంలో నిర్బంధించబడ్డారని లేఖలో తెలిపారు. ఆ తర్వాత కాలంలో అదృశ్యమయ్యాడని స్పష్టం చేశారు. మండల రాజు తన వృద్ధ తల్లిదండ్రులకు ఏకైక కుమారుడని ప్రస్తుతం వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. రోజువారీ జీవనోపాధికి ఎలాంటి ఆధారం లేక ఇబ్బందులు పడుతున్నారని సీఎం ఎదుట వాపోయారు. తెలంగాణ అమరవీరుల కోటా కింద మానవతా దృక్పథంతో ఆయన తల్లిదండ్రులకు ఆర్థిక సాయం అందించాలని సీఎంకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
Also Read: అయోధ్య రామమందిరం కేసులో సంచలనం.. 105 సార్లు విరాళాల చోరీ.. బయటపెట్టిన సిట్!