Erravalli Lands: స్వేచ్ఛ బ్యూరో: సిద్దిపేట జిల్లా, మర్కూక్ మండలం,ఎర్రవల్లి లోని భూముల అంశం మరింత వివాదస్పదంగా మారింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ సమీపంలో రికార్డుల్లో ఉండాల్సిన భూమి.. క్షేత్రస్థాయిలో మిస్సైనట్లు రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చారు. మంగళవారం ఆ భూ రికార్డుల గందరగోళం, సరిహద్దుల వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎర్రవల్లి, దాని శివారు వెంకటాపురం గ్రామాల పరిధిలోని సర్వే నంబరు 325 స్థలంపై అధికారులు నిర్వహించిన ప్రాథమిక సర్వే నివేదికను సీఎం పరిశీలించారు. రికార్డుల ప్రకారం 388 ఎకరాలు ఉండాలని, కానీ క్షేత్రస్థాయిలో 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు అధికారులు రిపోర్టు ఇచ్చారు. 45 ఎకరాలు లభించడం లేదని పొందుపరిచారు.దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ 45 ఎకరాల భూమి ఎక్కడుందో, ఎవరి కబ్జాలో ఉందో తక్షణమే తేల్చాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆక్రమణదారులు ఎంతటివారైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
కేసీఆర్ కుటుంబానికి బిగ్ షాక్..
ఆ సర్వే నంబర్ 325కు పక్కనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల భూములు, ఫామ్‌హౌస్ విస్తరించి ఉన్నాయి.అయితే మాయమైన 45 ఎకరాల భూమి సరిహద్దులు తేల్చేందుకు ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల్లో అధికారిక సర్వే నోటిఫికేషన్ విడుదలైంది.ఆయా సరిహద్దుల్లో భూములు కలిగి ఉన్న కేసీఆర్,ఆయన కుటుంబ సభ్యులకు తమ భూములకు సంబంధించిన పూర్తి రెవెన్యూ రికార్డులు సబ్మిట్ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు.అయితే సర్వే నంబర్ 325లో లెక్క తేలిన భూమిని ప్రభుత్వం కేవలంప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.భూమి లేని స్థానిక పేద రైతులకు ఈ భూమిని పంపిణీ చేస్తారు.అంతేగాక తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాల కోసం ప్రత్యేకంగా మోడల్ కాలనీని నిర్మించనున్నారు.ఇళ్ల స్థలాలతో పాటు తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ వంటి అంతర్జాతీయ ప్రమాణాల వసతులను కల్పిస్తారు. మరోవైపు అమరవీరుల కాలనీ నిర్మాణ బాధ్యతలను తెలంగాణ హౌసింగ్ డిపార్ట్ మెంట్ కు అప్పగించాలని సీఎం సూచించారు. తెలంగాణ అవతరణ దినోత్సవమైన జూన్ 2 నాటికి ఈ కాలనీ నిర్మాణం పూర్తయి, అమరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన గడువు విధించారు.
Also Read: నారా నట సామ్రాట్ చంద్రబాబు.. నా అల్లుడి కంటే గొప్ప నటుడు: రోజా పంచ్‌లు!