Loco Pilot vs Assistant Loco Pilot: రైలు కదులుతున్నప్పుడు ఇంజిన్ క్యాబిన్‌లో సాధారణంగా ఇద్దరు సిబ్బంది కనిపిస్తారు. వారిలో ఒకరు లోకో పైలెట్ (Loco Pilot – LP) కాగా.. మరొకరు అసిస్టెంట్ లోకో పైలెట్ (Assistant Loco Pilot). ఇద్దరూ కలిసి పని చేసినా.. వారి హోదా, బాధ్యతలు, నిర్ణయాధికారం విషయంలో తేడా ఉంటుంది. ఈజీగా చెప్పాలంటే.. రైలు నడపడంలో ప్రధాన బాధ్యత లోకో పైలెట్‌ది అయితే, ఆ ప్రయాణాన్ని సురక్షితంగా కొనసాగించేందుకు అవసరమైన పర్యవేక్షణ, సిగ్నల్స్ గమనించడం, టెక్నికల్ సపోర్ట్ ALP ఇస్తారు.
లోకో పైలెట్ రైలును సురక్షితంగా నడిపించే వ్యక్తి. రైలు వేగాన్ని నియంత్రించడం, సిగ్నల్స్‌ను పాటించడం, అవసరమైన చోట బ్రేకులు ఉపయోగించడం, రూట్ లో ఉన్న వేగ పరిమితులను గమనించడం లాంటి కీలక బాధ్యతలు ఉంటాయి. ప్రయాణ సమయంలో ఏదైనా అసాధారణ పరిస్థితి ఎదురైతే.. పరిస్థితిని అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా లోకో పైలెట్‌పై ఉంటుంది. సాధారణంగా లోకో పైలెట్ పోస్టుకు నేరుగా రారు. ప్రమోషన్ల ద్వారా వస్తారు.
అసిస్టెంట్ లోకో పైలెట్ పేరు చూస్తే కేవలం లోకో పైలెట్ కు హెల్పర్ లా అనిపించొచ్చు. కానీ వాస్తవానికి ఆయన బాధ్యతలు చాలా ముఖ్యమైనవి. రైలు ప్రయాణంలో సిగ్నల్స్ ను నిరంతరం గమనించి లోకో పైలెట్ కు తెలియజేయడం, లోకో పరికరాల పరిస్థితిని పర్యవేక్షించడం, అవసరమైన భద్రతా ప్రక్రియల్లో సహకరించడం వంటి పనులు చేస్తారు. ఇంజిన్, రైలుకు సంబంధించిన ఏదైనా అసాధారణ పరిస్థితి కనిపించినా వెంటనే లోకో పైలెట్ దృష్టికి తీసుకెళ్లాలి.
రైల్వేలో క్రాస్ చెకింగ్ కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. రైలు ముందున్న సిగ్నల్‌ను ALP గమనించి దాని పరిస్థితిని లోకో పైలెట్‌కు స్పష్టంగా తెలియజేస్తారు. దీంతో ఇద్దరి మధ్య పరస్పర నిర్ధారణ జరుగుతుంది. సుదీర్ఘ ప్రయాణంలో ఏ ఒక్క సిగ్నల్‌ను కూడా నిర్లక్ష్యం చేయకుండా ఉండేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది.
ALPలు లోకోమోటివ్‌లోని వివిధ పరికరాలు, సూచికలు, మీటర్లు తదితరాలను గమనిస్తూ ఉంటారు. రైలు ఆగినప్పుడు అవసరమైన తనిఖీల్లో కూడా పాల్గొంటారు. ఏదైనా చిన్న సాంకేతిక సమస్య గుర్తిస్తే.. పరిస్థితికి అనుగుణంగా లోకో పైలెట్‌కు సమాచారం అందించి, నిబంధనల ప్రకారం తదుపరి చర్యల్లో సహకరిస్తారు.
లోకో పైలెట్, ALP ఉద్యోగాలు సాధారణ 9 నుంచి 5 వరకు ఉండే ఆఫీస్ ఉద్యోగాలు కావు. రైళ్ల షెడ్యూల్‌కు అనుగుణంగా రాత్రి, పగలు, వారాంతాలు, పండుగల సమయంలో కూడా డ్యూటీలు రావచ్చు. రన్నింగ్ స్టాఫ్‌కు డ్యూటీ డ్యూరేషన్ అనేది రైలు రకం, రూట్, సర్వీస్, రైల్వే నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.
ఒక రైలు వందలాది మంది ప్రయాణికులను లేదంటే పెద్ద మొత్తంలో సరుకును తీసుకెళ్తుంది. అలాంటి రైలును సురక్షితంగా నడపడానికి ఒక వ్యక్తి అప్రమత్తతపై మాత్రమే ఆధారపడటం కంటే.. ఇద్దరు సిబ్బంది పరస్పరం పర్యవేక్షించుకోవడం చాలా ముఖ్యం. అందుకే లోకో పైలెట్ రైలు మెయిన్ కంట్రోల్ బాధ్యత వహిస్తే.. ALP భద్రత, సిగ్నల్స్, సాంకేతిక పర్యవేక్షణలో కీలక సహకారం అందిస్తారు.
Read Also: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 70 మలుపులు.. ఈ రోడ్డు మీద డ్రైవింగ్ అంటే మామూలు విషయం కాదు!