Big Stories

Etela Rajender : ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఆణిముత్యాలా?: ఈటల

Etela Rajender : ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ-టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాషాయ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ఈటల రాజేందర్ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందన్నారు. దేశం అధోగతి పాలవుతుందని కేసీఆర్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు.లక్షల మంది ఉద్యమంలో పాల్గొని చాలా మంది ప్రాణాలు అర్పిస్తే రాష్ట్రం ఏర్పాటైందన్నారు. కానీ కేసీఆర్ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు.నియంతలా పాలిస్తున్నారని విమర్శించారు.

- Advertisement -

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఏ విధంగా ఆణిముత్యాలని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఉన్న గౌరవం, మర్యాద విపక్ష నేతలకూ ఉండేదన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే నియోజకవర్గానికి మంత్రులు వచ్చేటప్పుడు సమాచారం ఇచ్చేవారని, అడిగిన పనులు చేసేవారని తెలిపారు. ప్రతిపక్షం నుంచి గెలిచిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగదని టీఆర్ఎస్ బెదిరింపులకు గురి చేస్తోందనేది నిజం కాదా? అని నిలదీశారు. వేరే పార్టీ గుర్తుపై గెలిచిన వాళ్లకు మంత్రి పదవులు ఎలా కట్టబెట్టారు? అని ప్రశ్నించారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? అని నిలదీశారు. రాష్ట్రం ఏర్పాటైన వెంటనే పలు ప్రసార మాధ్యమాలపై ఆంక్షలు విధించలేదా? అని కేసీఆర్ ను ప్రశ్నించారు. ఓట్ల కోసమే కేసీఆర్ కొత్త పథకాలు తీసుకొచ్చారని ఈటల మండిపడ్డారు. మునుగోడులో నైతికంగా కేసీఆర్ ఓడిపోయారని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలవడం ఖాయమని ఈటల విశ్వాసం వ్యక్తం చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News