Kakatiya University: స్వేచ్ఛ బ్యూరో: ఉన్నత చదువులు చదివి, సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాల్సిన విద్యార్థులు కొందరు అడ్డదారుల వెతుక్కుంటున్నారు. యూనివర్సిటీల్లో పరిశోధనలు చేయకుండానే లక్షలాది రూపాయల ఫెలోషిప్ నిధులను స్వాహా చేస్తున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీలో ఈ అక్రమ దందా పతాక స్థాయికి చేరినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీల్లో పరిశోధకులకు తాము చేసే పీహెచ్ డీ, పీడీఎఫ్ స్థాయి పరిశోధన ఆర్థిక భారంగా మారొద్దనే ఉద్దేశంతో యూజీసీ, ఐసీఎస్ఎస్ఆర్, సీఎస్ఐఆర్ లాంటి సంస్థలు ఇస్తున్న ఫెలో షిప్ లు పక్కదారి పడుతున్నాయి. ఏటా వందలాది మంది ఈ ఫెలోషిప్ లకు ఎంపికవుతున్నప్పటికీ.. కేవలం పదుల సంఖ్యలోనే తమ పరిశోధనను పూర్తి చేస్తున్నారు. ఫెలో షిప్ లు పొందేవారు ఎలాంటి ఉద్యోగం చేయొద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ కొందరు మరో ఉద్యోగం చేస్తూ రెండు రకాల ఆదాయం పొందుతున్నారు. మరికొందరు రీసెర్చ్ మీద ఖర్చు చేయకుండ ఫెలో షిప్ డబ్బులను ప్లాట్లు కొనడానికి, ఇల్లు కట్టుకోవడానికి వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఓ వైపు ఫెలోషిప్ లు క్లెయిమ్ చేస్తూనే మరో వైపు నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగం చేసిన ఇద్దరు పరిశోధకుల వ్యవహారం ఇటీవల కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగంలో వెలుగు చూసింది. కేయూ తెలుగు విభాగంలో కాంట్రాక్ట్ లెక్చరర్ గా పనిచేస్తున్న డాక్టర్ మంథని శంకరయ్య పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ తీసుకుంటూనే పార్ట్ టైం, కాంట్రాక్ట్ లెక్చరర్ గా జీతం తీసుకున్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం పోస్ట్ డాక్టోరల్ ఫెలో షిప్ తీసుకుంటూ ఇతర ఉద్యోగం చేయడానికి వీల్లేదు. కానీ శంకరయ్య లెక్చరర్ గా ఉద్యోగం చేస్తూనే ఫెలోషిప్, కాంటిజెన్సీ, హెచ్ఆర్ఏ కలిపి రూ.6,89,400 డ్రా చేశారు. అదే సమయంలో పార్ట్ టైం, కాంట్రాక్ట్ లెక్చరర్ గా 2,32,145 కూడా డ్రా చేశారు. గుట్టుగా సాగిన ఈ వ్యవహారం ఆర్నెళ్ల క్రితం వెలుగులోకి రావడంతో యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్లకు ఫిర్యాదులు అందాయి. దీంతో కెమిస్ట్రీ ప్రొఫెసర్ హనుమంతు చైర్మన్ గా మరో ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు.
ఈ కమిటీ విచారణలో శంకరయ్య రూ.6,89,400 ఫెలోషిప్ ను అక్రమంగా డ్రా చేసినట్లు తేలింది. ఆ మొత్తాన్ని తిరిగి యూజీసీకి చెల్లించాలని, అలాగే ఇటు యూనివర్సిటీని, అటు యూజీసీని చీట్ చేసిన శంకరయ్యను టర్మినేట్ చేయాలని ఐదు నెలల క్రితమే సిఫార్సు చేసింది. దీంతో శంకరయ్య వివిధ మార్గాల ద్వారా యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ పై ఒత్తిడి పెంచడంతో నెల రోజుల క్రితం రిపోర్టును ఎంక్వైరీ కమిటీ రివ్యూ చేయాలని మరోసారి కమిటీకి పంపారు. కానీ కమిటీ సభ్యులు యూజీసీకి చెల్లించాల్సిన అమౌంట్ తగ్గించలేమని, అది తమ పరిధి కాదని పాత సిఫార్సులకే కట్టుబడి ఉన్నట్లు తేల్చి చెప్పినట్లు తెలిసింది. రూ.6,89,400 శంకరయ్య ఇప్పటి వరకు చెల్లించపోయినా కేయూ వీసీ, రిజిస్ట్రార్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కాలేజీ ప్రిన్సిపాల్ గా ఉన్న కాంట్రాక్ట్ లెక్చరర్ డాక్టర్ రణధీర్ రెడ్డి కాలేజీ నిధులు రూ.8.50 లక్షలను సొంతానికి వాడుకుని, కొన్నాళ్లకు తిరిగి జమ చేశారు. విషయం బయటపడడంతో కొద్ది రోజుల్లోనే సదరు ప్రిన్సిపాల్ కు కాంట్రాక్ట్ రెన్యువల్ చేయకుండా టర్మినేట్ చేశారు. కానీ శంకరయ్య విషయంలో ఐదు నెలలయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇదే తెలుగు విభాగంలో డాక్టర్ చంద్రమౌళి అనే అనే వ్యక్తి పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ తీసుకుంటూ తెలుగు అకాడమీలో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నట్లు యూనివర్సిటీ గుర్తించింది. దీంతో ఫెలో షిప్ అమౌంట్ రివకరీ చేయాలని యూనివర్సిటీని యూజీసీ ఆదేశించి రెండేళ్లు దాటినా ఇప్పటి వరకు రికవరీ చేయలేదు. ఇద్దరు కూడా తమకు సూపర్ వైజర్ గా ఉన్న ప్రొఫెసర్లకే తెలిసే ఈ మోసాలకు పాల్పడడంతో వారి పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మంథని శంకరయ్య అక్రమాలు వెలుగు చూడడంతో.. తనలాగే మరో 15 మంది యూనివర్సిటీలో ఉన్నారని, వాళ్లపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే ‘నీపై పక్కా ఆధారాలతో ఫిర్యాదులు అందాయి. ఎంక్వైరీలోనూ అదే తేలింది. మిగతా వాళ్లపై కూడా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం’ అని యూనివర్సిటీ అధికార వర్గాలు చెప్పినట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ అన్ని యూనివర్సిటీల్లో లోతుగా ఎంక్వైరీ చేస్తే ఇలాంటివాళ్ల బండారం బయటపడే అవకాశముందనే చర్చ జరుగుతోంది. ఇలాంటివారు లక్షల్లో ఫెలో షిప్ తీసుకుంటూ పరిశోధనలను పూర్తి చేయకుండా యూజీసీ, ఐసీఎస్ఎస్ ఆర్ కు ఫైనల్ రిపోర్టు కూడా అందజేయడం లేదు. దీంతో పరిశోధన సంస్థల లక్ష్యం నెరవేరడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి చర్యలతో అక్రమాలు జరిగిన యూనివర్సిటీలను యూజీసీ, ఐసీఎస్ఎస్ఆర్, సీఎస్ఐఆర్ లాంటి సంస్థలు ఫె లోషిప్ లు ఇవ్వకుండ బ్లాక్ లిస్టులో పెట్టే ప్రమాదముందని పలువురు ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Food Adulteration: డేంజర్ బెల్స్.. తక్కువ ధరకు ఎక్కువ రుచి అని తెగ తినేస్తున్నారా..!