GHMC: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లో పరిపాలన సౌలభ్యం కోసం ఇటీవలే కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్లలో తీవ్రరూపం దాల్చిన ఆర్థిక సంక్షోభం కారణంగా కార్పొరేషన్లు నిధుల కోసం ఎదురుచూస్తున్నాయి. నవంబర్ 25 వరకున్న జీహెచ్ఎంసీ పరిధిలోకి కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసిన వెంటనే జీహెచ్ఎంసీ కౌన్సిల్ అంగీకరించటంతో అధికారులు ఆగ మేఘాలపై పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయటంతో పాటు పెరిగిన పరిధితో జీహెచ్ఎంసీ దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా అవతరించిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత వెంటనే పెరిగిన పరిధిని 300 మున్సిపల్ వార్డులుగా పునర్విభజింటంతో పాటు ఫిబ్రవరి 10వ తేదీ నాటికి జీహెచ్ఎంసీ కౌన్సిల్ అధికార గడువు ముగియటంతో మరుసటి రోజైన 11న జీహెచ్ఎంసీ పరిధిని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
మూడు కార్పొరేషన్ల సరిహద్దులను ఫిక్స్ చేయటంతో ఆటోమెటిక్ గా ఆస్తులపై క్లారిటీ వచ్చినా, అప్పులపై ఇంకా క్లారిటీ రాలేదు. అంతకు ముందు నుంచే జీహెచ్ఎంసీ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా, ఆ తర్వాత ఏర్పడిన రెండు కొత్త కార్పొరేషన్లలో కూడా పైసల కష్టాలు నెలకొన్నాయి. మూడు కార్పొరేషన్లు ఏర్పాటయ్యే సమయానికి గత ఆర్థిక సంవత్సరం చివరి రోజుల్లో ఉన్నందున ఫిబ్రవరి, మార్చి నెలల జీతాలు, ఇతర ఖర్చులు జీహెచ్ఎంసీ ఖాతా నుంచే చెల్లిస్తూ వచ్చారు. ఒక్కో కార్పొరేషన్ కు రూ. 500 కోట్లు చెల్లిస్తే, ఆ రెండు నెలల జీతాలను కొత్తగా ఏర్పడిన రెండు కార్పొరేషన్ల నుంచి జీహెచ్ఎంసీ రీ పేమేంట్ చేసుకోవాలని కూడా ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన సర్కారు ఒక్కో కార్పొరేషన్ కు రూ.500 కోట్లు చొప్పున కేటాయించినున్నట్లు ఫిబ్రవరి నెలలో జరిగిన మూడు కార్పొరేషన్ల మొదటి స్టాండింగ్ కమిటీ, పాలక మండలి సమావేశాల్లో స్పెషలాఫీసర్ జయేశ్ రంజన్ ప్రకటించారు.
మూడు కార్పొరేషన్లకు ఇంత వరకు పైసా నిధులు కూడా మంజూరు కాకపోవటంతో, నిధుల కోసం కార్పొరేషన్లు నిధులు ఎప్పుుడిస్తారో? నని ఎదురుచూస్తున్నాయి. నిధులిస్తామని ప్రకటించి నెలలు గడుస్తున్నా, ఇంత వరకు నిధులు విడుదల కాకపోవటంపై కార్పొరేషన్ల అధికారుల టెన్షన్ పడాల్సి వస్తుంది. మరో వైపు ఈ నెలా జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకు కూడా అధికారులు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. మూడు కార్పొరేషన్లు రొటీన్ మెయింటనెన్స్ ఖర్చులకు డైలీ వసూలవుతున్న ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ పైనే ఆధారపడి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. అభివృద్ది పనుల కోసం స్థల సేకరణను నష్టపరిహారం నగదు రూపంలో చెల్లించకుండా, ప్రత్యామ్నాయంగా ట్రాన్స్ ఫర్ డెవలప్ మెంట్ రైట్ (టీడీఆర్)లను జారీ చేసి సేకరించే అవకాశమున్నా, జీతాలు, పెన్షన్లు, కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించేందుకు ప్రత్యామ్నాయ మార్గం అంటూ లేకపోవటంతో ప్రతి నెలాఖరు రోజుల్లో చెల్లింపుల కోసం అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు.
Also read: గాంధీ భవన్ నుండి సీక్రెట్ ఆర్డర్స్.. రాష్ట్రంలో పెరిగిన పొలిటికల్ హీట్..?
వర్తమాన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నును ముందస్తుగా వసూలు చేసుకునేందుకు అయిదు శాతం రాయితీనిస్తూ అమలు చేస్తున్న ఎర్లీ బర్డ్ స్కీమ్ ద్వారా వచ్చే కలెక్షన్ తో కాస్త ఆలస్యమైనా ఏప్రిల్ మాసం జీతాలు చెల్లించే అవకాశాలున్నా, మే మాసం జీతాలెలా చెల్లించాలన్న టెన్షన్ ఇప్పటి నుంచే అధికారులకు పట్టుకుంది. మరో వైపేమో సైబరాబాద్, జీహెచ్ఎంసీ కార్పొరేషన్ల పరిధిలో హెచ్ సిటీ పనులు కూడా ఊపందుకున్నాయి. ఈ పనులకు స్థల సేకరణను టీడీఆర్ ద్వారా సేకరించాలని ఇప్పటికే జీహెచ్ఎంసీ నిర్ణయించుకున్నా, పనుల బిల్లుల చెల్లింపులకు నిధులెక్కడి నుంచి సమకూర్చుకోవాలోనంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
మూడు కార్పొరేషన్ల ఏర్పాటు, ఆస్తులు, అప్పుుల పంపకాలకు సంబంధించి నియమించిన టాస్క్ ఫోర్స్ కమిటీ త్వరలోనే సర్కారకు నివేదికను సమర్పించనున్నట్లు తెలిసింది. మూడు కార్పొరేషన్ల ఏర్పాటుకు ముందు జీహెచ్ఎంసీకి ఉన్న అప్పుల్లో ఇంకా చెల్లించాల్సిన రూ. 4786 కోట్లను ఒక వేళ సర్కారు చెల్లించేందుకు అంగీకారం తెలిపితే, మళ్లీ ప్రాజెక్టుల కోసం సర్కారునే నిధులు అభ్యర్థించాలా? ఒక వేళ ప్రత్యామ్మాయ మార్గాలేమైనా ఉన్నాయా? అన్న అంశాన్ని కూడా అధికారులు పరిశీలించినా, ఇప్పటికే పరిమితి దాటి అప్పులు చేసినందున ఎక్కడా కూడా అప్పులు పుట్టని పరిస్థితులున్నాయి. దీంతో ఉన్న ఆదాయ మార్గాలనే పెంచుకోవాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు తెలిసింది.
Also read: ప్రకాష్ రాజ్‌ను ఎవరైనా లేపేస్తే.. బీజేపీ నేత తీవ్ర వ్యాఖ్యలు