Hyderabad Fire Safety: హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించిన విషయం మనకు తెలిసిందే. ఈ ఘటనలో దురదృష్టవశాత్తు 17 మంది ప్రాణాలు కోల్పోగా, ఇందులో 8 మంది చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదం ఉదయం 5:30 గంటల సమయంలో జరిగినప్పటికీ, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ముత్యాల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని అందరూ భావిస్తున్నారు. ఈ మంటలు త్వరగా పై అంతస్తులలో ఉన్న నివాస ప్రాంతాలకు వ్యాపించగా, అక్కడ నివసిస్తున్న వారు కూడా పొగతో ఊపిరాడక మృతి చెందారని సమాచారం. అయితే ఇలాంటి ప్రమాదాలు జరిగిన సమయంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, ప్రాణాపాయ పరిస్థితి నుండి బయటపడవచ్చు.
హైదరాబాద్‌లో గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం లాంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకుండా, నగర ప్రజలు తమ ఇళ్లలో ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల నగరంలో నెలలో ఒక భారీ అగ్ని ప్రమాదం జరుగుతున్న పరిస్థితి. అయితే ఈ సారి ఏకంగా 17 మంది మృతి చెందడం పెద్ద విషాదమే. అందుకే మనం తీసుకొనే జాగ్రత్తలే మన ప్రాణాలకు రక్ష.
ఇల్లు నిర్మాణ సమయంలోనే తీసుకోవలసిన జాగ్రత్తలు..
ఎలక్ట్రికల్ వైరింగ్ సురక్షితంగా ఉండాలి. గుర్తింపు పొందిన ఎలక్ట్రిషన్ తో ఇంటి పనులు చేయించుకోవడం ఉత్తమం. మల్టిపుల్ ఎలక్ట్రానిక్ డివైస్‌లను ఒకే ప్లగ్‌లో వేయకుండా ఉండాలి. ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్స్ వాడితే ప్రమాదం తక్కువ అవుతుంది. వెన్టిలేషన్ సిస్టమ్ సరైనదిగా ఉండాలి, అప్పుడే పొగ బయటకు వెళ్లేందుకు మార్గం ఉంటుంది.
విద్యుత్ పరికరాల వాడకంలో జాగ్రత్తలు..
గోధుమ రంగు మోఫ్డ్, అధిక వేడి వచ్చే ప్లగ్‌లను వెంటనే మార్చేయాలి. చార్జింగ్‌లో ఉన్న మొబైల్, ల్యాప్‌టాప్‌లు వేసి నిద్రపోవద్దు. గైజర్స్, మైక్రోవేవ్, ఇన్వర్టర్ బ్యాటరీలు వాడే సమయంలో పర్యవేక్షణ ఉండాలి.
అగ్ని ప్రమాద నివారణ పరికరాలు.. అవగాహన
స్మోక్ డిటెక్టర్‌లు ప్రతి ఫ్లాట్‌లో ఉండాలి. ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ ప్రతి ఫ్లోర్‌లో కనీసం ఒకటి ఉండాలి. ఫైర్ ఎగ్జిట్ ఖచ్చితంగా ప్లాన్ చేయాలి. పిల్లలకు ఎలక్ట్రానిక్స్‌కు దూరంగా ఉండే పద్ధతులు నేర్పించండి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలో ఫ్యామిలీతో రిహార్సల్ చేయండి. అగ్నిమాపక విభాగ నంబర్ 101 గుర్తుంచుకోవడం తప్పనిసరి.
అపార్ట్‌మెంట్ వాసులకు ప్రత్యేక సూచనలు..
అపార్ట్‌మెంట్ అసోసియేషన్‌లు నెలకు ఒకసారి ఫైర్ డ్రిల్ నిర్వహించాలి. ఎలివేటర్‌ల్లో ఎమర్జెన్సీ బటన్ పని చేస్తున్నదో లేదో రెగ్యులర్‌గా చెక్ చేయాలి. ఈ జాగ్రత్తల ద్వారా మన ఇల్లు అగ్నిప్రమాదం సమయంలో ఉన్నప్పటికీ, మనం మన ప్రాణాలను రక్షించుకోవచ్చు. ప్రాణాలను కాపాడే విషయంలో చులకన చేయకుండా, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నెరవేర్చాలి.
ఇలా చేస్తే.. మన ప్రాణాలు సేఫ్
అగ్ని ప్రమాదం సమయంలో ప్రాణాపాయం జరగకుండా ఉండేందుకు తక్షణంగా తీసుకోవాల్సిన చర్యలు చాలా కీలకమైనవి. వాటిని పాటిస్తే, మన ప్రాణాలను మనం కాపాడుకోవచ్చు. పరిస్థితిని వెంటనే గుర్తించాలి. పొగ బయటకు వస్తే వెంటనే అగ్ని ప్రమాదమని అనుమానించాలి. పొగను పీల్చకుండా ఉండేందుకు ముక్కు, నోటి పై తడి గుడ్డతో మూసుకోవాలి. వెంటనే బయటకు రావాలి. ఇంట్లో ఉంటే తక్షణమే బయటకు రావాలి. విలువైన వస్తువులు తీసుకురావాలనే ప్రయత్నం చేయవద్దు.
ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేయాలి. అగ్ని ప్రమాద సమయంలో ఎలివేటర్ పనిచేయకపోవచ్చు. మెట్లు వాడడమే సురక్షితం. ఇంట్లో ఉంటే, పొగ ఎక్కువగా చొచ్చుకొచ్చే కిటికీలు, తలుపులు మూసేయండి. గాలిని నియంత్రించడమే పొగ వ్యాప్తిని తగ్గించడంలో సహకరిస్తుంది. తడి టవెల్ లేదా చీరను తలపై పెట్టుకుని తలుపు తెరవండి లేదా బయటికి పరుగెత్తండి. మీతో పాటు ఉన్నవారిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించండి కానీ పరిస్థితి ప్రమాదకరంగా ఉంటే వెంటనే సహాయం కోరండి. విద్యుత్ తీగలు భయంకరమైన ప్రమాదాలకు దారి తీస్తాయి. కనుక దాన్ని దాటకండి.
Also Read: Vande Bharat Trains: వందే భారత్ ట్రైన్.. తయారీ ఖర్చు ఎంత? ఎన్ని గంటల్లో రెడీ అవుతుందంటే?
ప్రత్యేక సూచనలు ఫ్లాట్లలో ఉంటే..
ఫైర్ అలారంలు పని చేస్తున్నాయా లేదో పరిశీలించాలి. అన్ని ఎగ్జిట్ మార్గాలు ముందే తెలుసుకోవాలి. ప్రతి ఇంట్లో స్మోక్ అలారమ్, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ ఉండాలి. కుటుంబ సభ్యులకు ఫైర్ ఎమర్జెన్సీ ప్లాన్ బోధించాలి. వీటిని పాటిస్తే అగ్ని ప్రమాదం సమయంలో మనం మన కుటుంబాన్ని, మన ప్రాణాలను కాపాడుకోగలమన్న నమ్మకంగా ఉండవచ్చు.
మీ ప్రాంతంలో అధికారుల ఫైర్ డ్రిల్స్ ఉంటే తప్పక పాల్గొని అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండడం అవసరం.