Hyderabad : మే 18. ఆదివారం తెల్లవారుజామున. హైదరాబాద్, పాతబస్తీలోని గుల్జార్ హౌజ్‌లో భారీ అగ్నిప్రమాదం. ఆ పాతకాలం నాటి భవనం మొదటి అంతస్తులో భారీగా మంటలు చెలరేగాయి. సెకండ్ ఫ్లోర్‌లో 17 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ ఉదంతంలో అనేక డౌట్స్. మంటలు చెలరేగితే పారిపోలేదా? బిల్డింగ్ పైకి ఎక్కలేదా? తప్పించుకునే టైమ్ చిక్కలేదా? ఇలా అనేక ప్రశ్నలు. ప్రధాని మోదీ సైతం స్పందించిన ఆ ఘటనలో అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రమాదంపై జరుగుతున్న విచారణలో పలు అంశాలపై క్లారిటీ వస్తోంది.
వెంటనే ఫోన్ చేసి ఉంటే..
నాగ్‌పుర్‌కు చెందిన ఫైర్ ఫోరెన్సిక్ నిపుణులు ప్రత్యేకంగా దర్యాప్తు చేశారు. వారు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా అగ్నిమాపకశాఖ ఓ నిర్ణయానికి వచ్చింది. మంటలు చెలరేగిన వెంటనే ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి ఉంటే ఇంతటి ప్రమాదం జరిగి ఉండకపోవచ్చని తెలుస్తోంది. స్వయంగా మంటలు ఆర్పేందుకు ప్రయత్నించే క్రమంలో.. దాదాపు గంట ఆలస్యం అవడంతోనే 17 మంది మృతి చెందినట్టు అగ్నిమాపక శాఖ నిర్ధారించింది.
గదిలో తలుపులు వేసుకుని..
కింది అంతస్తులో అగ్ని ప్రమాదం వల్ల వచ్చిన పొగ.. భవనం మొత్తం వ్యాపించింది. అయితే, పొగ నుంచి తప్పించుకునే క్రమంలో కుటుంబ సభ్యులంతా పై అంతస్తులో వెనుక వైపు ఉన్న గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారట. దీంతో గదిలో ఉన్న వారంతా ఆ పొగ పీల్చడం వల్లే చనిపోయారని నిర్ధారించింది ఫైర్ ఫోరెన్సిక్ బృందం. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే అగ్నిమాపక శాఖకు ఫోన్ చేసి ఉంటే చాలా మందిని కాపాడటానికి అవకాశం ఉండేదని దర్యాప్తు అధికారులు తెలిపారు.
ఇన్వర్టర్ వల్లే..
ఇంతకీ అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే దానిపైనా క్లారిటీ వచ్చింది. కరెంట్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని అగ్నిమాపక శాఖ అంటుంటే.. విద్యుత్ శాఖ అధికారులు మాత్రం దాన్ని కొట్టిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాస్తవాలను తేల్చేందుకు అగ్నిమాపక శాఖ.. నీలేశ్, మహిపాల్‌రెడ్డితో కూడిన ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేయించింది. అసలు విషయం తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ శాఖ సప్లై చేసే కరెంట్ కట్ అయిందని.. ఆ టైమ్‌లో ఇన్వర్టర్ రన్ అవుతోందని గుర్తించారు. ఆ ఇన్వర్టర్‌లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్లే గుల్జార్‌హౌజ్‌లో మంటలు చెలరేగాయని తేల్చారు.
గంట లేట్ చేశారు..
నివేదిక ప్రకారం.. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో కింది గదిలోని షో కేస్‌లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. షో కేస్ అంటుకుంది. మంటల తీవ్రతకు ఏసీ పేలిపోయింది. నిద్రిస్తున్న వ్యక్తులు అలర్ట్ అయ్యేలోగా మంటలు అలుముకున్నాయి. పై అంతస్తులో ఉన్న 17 మంది పొగ భయానికి వెనుకవైపు ఉన్న గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఇద్దరు మహిళలు ఉదయం 6.13 గంటల సమయంలో మెట్ల మీదుగా రోడ్డు మీదకు వచ్చి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు సహాయక చర్యలు చేపట్టి అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. సుమారు 5 గంటలకు ఫైర్ మొదలైతే.. 6 గంటల తర్వాతే ఫైర్ స్టేషన్‌కు విషయం తెలిసింది. ఆ గంటలోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వెంటనే ఫోన్ చేసి ఉంటే.. వారంతా ప్రాణాలతో ఉండే అవకాశం ఉండేదని అంటున్నారు అగ్నిమాపక శాఖ అధికారులు. పూర్తి నివేదికను ఫైర్ డీజీకి అందించనున్నారు.
Also Read : భూకంపం.. సునామీ.. మహా విలయం