Ganesha immersion: హైదరాబాద్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనాలు రేపు ఉదయం 6 గంటల నుంచి అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 7న ఉదయం 10 గంటల వరకు భాగ్య నగరంలో గణేశ్ విగ్రహాల నిమజ్జనం జరగనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రతీ ఒక్కరు పోలీసులకు సహకరించాలని అన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీస్ అధికారులు కోరారు. బాలాపూర్ నుంచి వచ్చే ప్రధాన గణేష్ శోభాయాత్ర చార్మినార్, అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్‌బండ్ మీదుగా నెక్లెస్ రోడ్డు వైపు వెళ్తుందని అధికారులు పేర్కొన్నారు.
సికింద్రాబాద్ ప్రాంతం నుంచి వచ్చే గణపతి విగ్రహాలు ప్యారడైజ్, ప్యాట్నీ, రాణిగంజ్, కర్బలామైదాన్ నుంచి ట్యాంక్‌బండ్ వద్దకు చేరుతాయని తెలిపారు. మెహిదీపట్నం, టోలిచౌకీ ప్రాంతాల నుంచి వచ్చేవి ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్ కు వస్తాయని పేర్కొన్నారు. ఆసిఫ్‌నగర్, టపాఛబుత్ర నుంచి వచ్చే విగ్రహాలకు ఎంజే మార్కెట్ లోకి మాత్రమే అనుమతి ఉంటుందని అన్నారు. ప్రధాన నిమజ్జన రూట్లలో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు అధికారులు వివరించారు.
ఈ జంక్షన్లలో ట్రాఫిక్ ఆంక్షలు..
చాంద్రాయణగుట్ట, సౌత్ ఈస్ట్ జోన్ కేశవగిరి, చంచల్‌గూడ, మూసారాంబాగ్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనపై ఆంక్షలు ఉంటాయి. ఈ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు మదీనా, అలియాబాద్, నయాపూల్, ఎంజే మార్కెట్, దారుషిఫా ప్రాంతాల వైపుకు మళ్లిస్తారు. పుత్లిబౌలి, హిమాయత్‌నగర్, శివాజీ బ్రిడ్జ్, వైఎంసీఏ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయని అధికారులు తెలిపారు. నార్త్ జోన్ లో పారడైజ్, పాట్నీ, రాణిగంజ్ ప్రాంతాలలో ట్రాఫిక్‌ను మళించనున్నట్టు పేర్కొన్నారు.
ఈ జంక్షన్లలో వాహనాలకు అనుమతి లేదు..
అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, బుద్ధభవన్ జంక్షన్లలో వాహనాలను అనుమతి లేదని ఇప్పటికే అధికారులు వెల్లడించారు.
నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తి..
వాహనదారులు ఖైరతాబాద్, ఎంజే మార్కెట్, లిబర్టీ, అబిడ్స్, తెలుగు తల్లి చౌరస్తా, రాణిగంజ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్, పీపుల్స్ ప్లాజా జంక్షన్లను దాటకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు. ఎయిర్ పోర్ట్ కు వెళ్లేవారు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే లేదా ఔటర్ రింగ్ రోడ్ ద్వారా మాత్రమే వెళ్లాలని చెప్పారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లేవారు బేగంపేట – పారడైజ్ మార్గాన్ని ఎంచుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిమజ్జనం కోసం 8 పోర్టబుల్ వాటర్ ట్యాంకులు, 10 బేబీ పాండ్లు, 8 ఎక్స్కవేషన్ పాండ్లను ఏర్పాటు చేసినట్టు అధికారులు వివరించారు.
హెల్ప్ లైన్ నంబర్లు: ఏదైనా అత్యవసర సహాయం లేదా సమాచారం కోసం ప్రజలు 040-27852482, 9010203626, 8712660600 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.
ALSO READ: CM Revanth Reddy: కేసీఆర్ పాపాలు బయటకు వస్తాయనే.. వీఆర్వో, వీఆర్ఏలను తొలగించాడు: సీఎం రేవంత్