GHMC: జీహెచ్ఎంసీకి పదేళ్లుగా పట్టిన బూజు దులిపే పనిలో నిమగ్నమయ్యారు కమిషనర్ ఇలంబర్తి. ఒక్కో విభాగంతో భేటీ అయి సమస్యలు తెలుసుకుంటున్నారు. వారిపై వచ్చిన అవినీతి ఆరోపణలపైనా దృష్టిపెట్టారు. ముఖ్యంగా పొరుగు సేవల సిబ్బందిపై అవినీతి ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి.
కీలకమైన విభాగాల లాగిన్ వివరాలను ఆయా సిబ్బంది ఇవ్వడంలేదు. వాటిని తమ వద్దే కొందరు సిబ్బంది ఉంచుకుంటున్నారు. దీనిద్వారా అవినీతికి దారులు పరుస్తున్నారు. ఏళ్ల తరబడి అవినీతికి పాల్పడుతున్న సిబ్బందిపై ఫోకస్ చేశారాయన. కొన్ని విభాగాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అటు వైపు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆ సిబ్బందిపై విచారణ చేపట్టాలని నిర్ణయించారు.
రేపోమాపో నిఘా విభాగానికి కమిషన్ లేఖ రాయనున్నారు. వందల సంఖ్యలో సిబ్బంది అవినీతికి పాల్పడినట్టు అంతర్గత సమాచారం. వారిపై నివేదికలు తెప్పించి చర్యలు చేట్టేందుకు సిద్ధమైనట్టు కమిషనర్ కార్యాలయం వర్గాలు చెబుతున్నాయి.
2007లో జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాల్టీలు విలీనమయ్యాయి. ఆ సమయంలో పొరుగు సేవల కింద నియామకం జరిగింది. గడిచిన పదేళ్లు పైగానే ఆ కుర్చీలో కొనసాగుతున్నారు. వీరిపై కమిషనర్ ఫిర్యాదులు జోరందుకున్నాయి. న్యాక్ ఇంజనీర్లు, చైన్‌మెన్లు, ప్రైవేటు బిల్ కలెక్టర్లు.. బినామీ సంస్థలతో ఇంజనీరింగ్ పనులు దక్కించుకోవడం, టెండర్లు ప్రక్రియను పక్కదారి పట్టించడం జరిగింది.
ALSO READ: కమిషనర్ దూకుడు.. బెంబెలెత్తున్న అధికారులు, త్వరలో విచారణ
అలాగే జనన ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే ఆపరేటర్లు సైతం అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. ఒకేచోట ఐదేళ్లకు మించి పని చేస్తున్నవారిని మార్చాలనే నిర్ణయానికి ఇటీవల వచ్చారు కమిషనర్. రేపో మాపో వారిని ట్రాన్సఫర్ చేయడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది. మొత్తానికి పదేళ్లకు పైగా పట్టిన బూజు వదలడం ఖాయమని అంటున్నారు.