GHMC: జీహెచ్ఎంసీలో ప్రక్షాళన మొదలుకానుందా? ఏళ్ల తరబడి అక్కడే మకాం వేసిన అధికారులపై వేటు పడుతుందా? అవినీతి అధికారులను గుర్తించి బదిలీ వేయాలని నిర్ణయానికి కమిషనర్ వచ్చారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పెరిగింది. గతంలో కంటే కొన్ని గ్రామాలు, మున్సిపాల్టీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసింది ప్రభుత్వం. అయినా పనులు మాత్రం ఆశించిన స్థాయిలో వేగంగా జరగలేదని తేలింది. దీనిపై అంతర్గతంగా వివరాలు సేకరించారట కమిషనర్ ఇలంబర్తి.
జీహెచ్ఎంసీలో ప్రక్షాళన చేయాలనే నిర్ణయానికి వచ్చారు కమిషనర్. కమిషనర్‌గా ఇలంబర్తి పూర్తి బాధ్యతలు చేపట్టారు. తొలుత సొంతింటిని చక్కబెట్టుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఆఫీసులో పని చేసే అధికారుల గురించి ఆరా తీసినట్టు తెలుస్తోంది. అవినీతి అధికారులను పక్కన పెట్టాలనే ఆలోచనకు వచ్చినట్టు సమాచారం.
కమీషన్లు తీసుకునే అధికారుల గురించి ఆరా తీశారట. అందులో విస్తుపోయే విషయాలు రావడంతో వెంటనే కొందరు అధికారులను మార్చాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. GHMC లో పని చేస్తున్న ప్రతి కంప్యూటర్ ఆపరేటర్, ఇంజనీరింగ్ విభాగంలో కొందరు అధికారిపై బదిలీ వేటు వేయాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్టు సమాచారం.
ALSO READ: కేటీఆర్‌కు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి కౌంటర్.. ఈ మాట ఆనాడేమైంది?
కాంట్రాక్టర్లతో సమావేశమయ్యారు కమిషనర్ ఇలంబర్తి. ఇప్పటివరకు చేపట్టిన పనులు, చేయకుండా పెండింగ్‌లో పెట్టినవాటి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు ఆలస్యం వెనుక ఏం జరుగుతుందో అనేది తెలుసుకునే పడ్డారు. చివరకు వర్క్ ఇన్స్పెక్టర్ల స్థాయి నుంచి చీఫ్ ఇంజనీర్ల వరకు ట్రాన్సఫర్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఒకే చోట ఐదేళ్లకు మించి పని చేస్తున్న శానిటేషన్ సూపర్వైజర్‌లను మార్చాలని నిర్ణయించారట కమిషనర్. గడిచిన పదేళ్లుగా చాలా మంది అక్కడే మకాం పెట్టారు. వారిని బయటకు పంపాలనే నిర్ణయానికి వచ్చినట్టు జీహెచ్ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. కమిషనర్ తీసుకున్న నిర్ణయాలతో కొందరు అవినీతి అధికారులపై అలజడి మొదలైంది. టౌన్ ప్లానింగ్, బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల విభాగాలు సైతం ఉన్నాయని సమాచారం.