Nalgonda News: నల్లగొండ జిల్లాలో మేకల దొంగతనాలకు పాల్పడుతున్న 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు రాత్రి సమయాల్లో ఖరీదైన కార్లలో దొంగతనానికి పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.2.46 లక్షల నగదు, 22 గొర్రెలు, రూ.17 లక్షల విలువ గల 8 కార్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర మీడియాకు తెలిపారు.
గత కొన్ని నెలల నుంచి జిల్లాలో మేకలు, గొర్రెలు దొంగతనానికి గురువుతున్న సంఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం సమయంలో శాలి గౌరారం మండలంలోని బైరవోని బండ క్రాస్ రోడ్డు వద్ద వాహన పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే షిఫ్ట్ డిజైర్ కారు వద్దకు తనిఖీ చేసేందుకు వెళ్లగానే కారులో నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. వెంటనే వాహనాన్ని వెంబడించి పోలీసులు వారిని పట్టుకున్నారు. అందులో ముగ్గురు పురుషులు, ఓ మహిళ ఉన్నట్లు చెప్పారు. వారిని వెంకటేశ్, వెంరెడ్డి శ్రీనివాసరెడ్డి, సంపంగి శారద, దాసర్ల వినోద్ కుమార్ అలియాస్ కోటిగా పోలీసులు గుర్తించారు.
ALSO READ: Jobs in Indian Railway: గోల్డెన్ ఛాన్స్.. రైల్వేలో 3518 అప్రెంటీస్ పోస్టులు, ఇదే మంచి అవకాశం
వీరిపైన గతంలో కూడా కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. నల్లగొండ రూరల్, కనగల్, చండూర్, విజయపురి, నార్కట్ పల్లి, నల్లగొండ 2 టౌన్, మర్రిగూడ, దేవరకొండ, శాలిగౌరారం, నాంపల్లి, మునుగోడు, చింతపల్లి పోలీస్ స్టేషన్లలో మేకలు, గొర్రెల దొంగతనాల కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. వీరితో పాటు మరో 12 మందితో కలిసి నాలుగు ముఠాలుగా ఏర్పడి దొంగతనానికి పాల్పడినట్టు తెలిపారు. ఈ ముఠా ఎవరికీ అనుమానం రాకుండా ఖరీదైన కార్లలో వచ్చి పగటి వేళ రెక్కి నిర్వహించి రాత్రి సమయాల్లో వచ్చి మేకలు, గొర్రెలను కార్లలో వేసుకుని దొంగతనాలకు చేసే వారని పోలీసులు చెప్పారు.
ALSO READ: Hyderabad: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. 50 మంది విద్యార్థులకు డ్రగ్స్ పాజిటివ్
విచారణలో వీరంతా జిల్లాలో 15 చోట్ల దొంగతనానికి పాల్పడినట్టు తేలిందని పోలీసులు తెలిపారు. అలాగే రాచకొండ, సైబరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల పరిధిలో 10 చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారని చెప్పారు. దొంగలించిన మేకలను సంతల్లో అమ్మి వచ్చిన డబ్బులతో పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేసేవారని చెప్పారు. ఇప్పటి వరకు వీరు 200కు పైగా మేకలు, గొర్రెలు అమ్మినట్లు పోలీసులు వెల్లడించారు.