Harish Rao: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఇప్పుడు చర్చంతా ఆయన చుట్టూనే తిరుగుతోంది. అందరి కళ్లు, విమర్శలు ఒకే ఒక్కడి చుట్టూ తిరుగుతున్నాయి. అసెంబ్లీ లోపలైనా, బయటైనా అధికార పక్షానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ‘ట్రబుల్ షూటర్’ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు. ఇప్పుడు అన్ని పార్టీలకు ప్రధాన శత్రువుగా మారారనే ప్రచారం జరుగుతుంది. ఆయనను రాజకీయంగా ఒంటరిని చేసేందుకు అటు ప్రత్యర్థులు, ఇటు సొంత పార్టీలోని కొన్ని శక్తులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయా? అంటే ప్రస్తుత పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. అంతేకాదు అసెంబ్లీలో అయినా, బయట అయినా గణాంకాలతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసే హరీష్ రావును అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్ష బీజేపీ ఏకధాటిగా టార్గెట్ చేస్తున్నాయి. తెలంగాణ రక్షణసేన పార్టీ అధినేత సైతం విమర్శలకు పదును పెట్టారు. చివరకు సొంత పార్టీలోనూ ఆయనపై జరుగుతున్న ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
హరీష్ రావు అంటేనే గణాంకాల గని. ఏ విషయాన్నైనా లోతుగా అధ్యయనం చేసి, ఆధారాలతో సహా ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఇటీవల అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన చేసిన దాడి అధికార పక్షానికి ఇబ్బందికరంగా మారింది. తాజాగా హరీష్ రావు ధాన్యం కొనుగోళ్లపై, మక్క జొన్న, జొన్న పంటలపై సీఎంకు రాసిన బహిరంగలేఖ సైతం విస్తృత చర్చకు దారితీసింది. దీంతో కాంగ్రెస్ మంత్రులు, ఆపార్టీ నేతలు సైతం మూకుమ్మడిగా హరీష్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఆయన ఏ చిన్న మాట మాట్లాడినా సరే, మంత్రులు రంగంలోకి దిగి కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు పరిపాటిగా మారింది. ఏ జిల్లాకు వెళ్లి మాట్లాడిన అక్కడి స్థానిక నేతలు సైతం కౌంటర్లు ఇస్తున్న పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం హరీష్ రావును ప్రధాన రాజకీయ శత్రువుగా భావిస్తోందనే ప్రచారం జరుగుతుంది. ఆయనకు మైలేజ్ రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తోందనే ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు కేసీఆర్ కంటే హరీష్ రావును టార్గెట్ చేస్తేనే పార్టీకి, ప్రభుత్వానికి మైలేజీ వస్తుందని కాంగ్రెస్ భావిస్తోందని సమాచారం. అందుకే గజ్వేల్ కంటే సిద్దిపేటపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది.
Also read: రన్నింగ్ బైక్ పై అత్త, అల్లుడి మధ్య గొడవ..హెల్మెట్‌తో అత్తను చంపిన అల్లుడు
కేవలం ప్రత్యర్థి పార్టీలే కాదు, సొంత పార్టీలోనూ హరీష్ పరిస్థితిపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. “అవసరమైనప్పుడు వాడుకోవడం.. అన్నీ చక్కబడ్డాక పక్కన పెట్టడం” గులాబీ పార్టీలో హరీష్ విషయంలో జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా కవిత అరెస్ట్ తర్వాతి పరిణామాలు, పార్టీలో జరుగుతున్న అంతర్గత చర్చల్లో హరీష్ ప్రాధాన్యతపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు సభలను గులాబీ నిర్వహించినా హరీష్ రావును మచ్చిక చేసుకొని ఆ తర్వాత పక్కకు పెడుతున్నారనే ప్రచారం జరుగుతుంది. అంతేకాదు పార్టీలో పదవి సైతం ఇవ్వకుండా ఆయన సేవలను వాడుకుంటున్నారే తప్ప ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన అనుచరులే అభిప్రాయపడుతున్నారు.
పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, ఎన్నికల మేనేజ్‌మెంట్ అవసరమైనప్పుడు హరీష్‌ను వాడుకుని, ఆ తర్వాత పక్కన పెడతారనే ప్రచారం ఊపందుకుంది. కనీసం త్వరలో పార్టీ చేపట్టబోయే కమిటీల్లోనూ, సభ్యత్వ నమోదులోనూ ఆయనకు బాధ్యతలు అప్పగిస్తారా? లేదా? అనే చర్చసైతం జరుగుతుంది. మరోవైపు గత నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పార్టీ సమావేశంలోనూ కనీసం హరీష్ రావు చేస్తున్న కృషిని కేసీఆర్ ప్రస్తావించలేదని, పేరును కూడా ప్రస్తావించలేదని సమాచారం. దీంతో హరీష్ రావు అనుచరులు కొంత అసంతృప్తికి గురవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వ తప్పిదాలను, రాష్ట్రానికి విభజన సమయంలో ఇచ్చిన హామీలు, నిధులపై తరచూగా హరీష్ రావు విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ నేతలు ఇచ్చిన హామీల అంశాలను సైతం ఎత్తిచూపుతుండటంతో .. కమలం పార్టీకి డ్యామేజ్ అవుతుందని భావించి విమర్శలకు పదును పెడుతున్నారు. కేంద్రానికి లేఖలు రాసినా, విమర్శలు చేసినా రాష్ట్ర కమిటీతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం ప్రతివిమర్శలకు పదును పెడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి వెన్నెముకగా ఉన్న హరీష్ విశ్వసనీయతను దెబ్బతీయాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోందనే ప్రచారం జరుగుతుంది.
Also read: మనిషి 200 జీవించడం సాధ్యమే? గేమ్ ఛేంజర్ కొత్త ప్రొటీన్
గతేడాది కాలంగా హరీష్ రావుపై తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కవిత విమర్శలు చేస్తున్నారు. ఆమె చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు కూడా హరీష్ రావును ఇరకాటంలో పెట్టేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత..
గుంట నక్క అని సంబోదిస్తు పదునైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అంటూ పేర్కొంటూ హరీష్ రావు అటాక్ చేస్తున్నారు. దీంతో హరీష్ రావు అనుచరులు తీవ్ర అసహనానికి గురవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఇన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నా, హరీష్ రావు మాత్రం తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. సమాచారంతో కూడిన విమర్శలు చేస్తూ, ప్రజల్లో తనకున్న పట్టును నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. “టార్గెట్ చేయడం అంటే నేను బలంగా ఉన్నానని అర్థం” అనే ధీమాతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ రాజకీయ చదరంగంలో హరీష్ రావు తన చతురతతో ప్రత్యర్థుల ఎత్తులను ఎలా చిత్తు చేస్తారో చూడాలి.
Also read: మైండ్ గేమ్ తో వస్తున్న పృథ్వీరాజ్.. ఐ, నోబడీ టీజర్ రిలీజ్!