Girls Boyfriend: హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న 25 ఏళ్ల యువతికి ఇటీవల పెద్దల సమక్షంలో పెళ్లి ఫిక్సయింది. అయితే ఆ యువతి మాజీ బాయ్ ఫ్రెండ్ తనకు కాబోయే అత్త మామలకు ప్రైవేట్ ఫోటోలను లీక్ చేయడంతో తన పెళ్లి సంబంధం రద్దు అయ్యింది. దీంతో ఆ యువతి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి మాజీ భాయ్ ఫ్రెండ్ వేధింపులపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల ప్రకారం.. 2019 నుంచి ఆ యువతి ఓ యువకుడితో రిలేషన్ షిప్ లో ఉంది. గతంలో వారిద్దరు కలిసి ఉన్న సమయంలో యువతి బాయ్ ఫ్రెండ్ తన ఫోన్ సరిగా పనిచేయడం లేదని చెబుతూ.. ఆమెను నమ్మిస్తూ ఓటీపీని షేర్ చేసేలా ఆమెను మోసం చేశాడు. ఓటీపీ ద్వారా ఆమె కాంటాక్ట్‌లను అతను యాక్సెస్ చేసిన తర్వాత, ఆమె తన కాల్స్, మెసేజ్ కు స్పందించనప్పుడల్లా ఆ యువతిని నానా ఇబ్బందులు పెట్టేవాడు.
యువతి మాజీ బాయ్ ఫ్రెండ్ అసభ్య పదజాలంతో ఆమె స్నేహితులను, కుటుంబ సభ్యులను పిలిచేవాడు. తనను పట్టించుకోకుంటే ప్రైవేట్ ఫోటోలు లీక్ చేస్తానని తరుచూ బెదిరించేవాడు. తనతో మాట్లాడాలని ఎప్పుడూ వేధిస్తూ ఉండేవాడు. నోటికి ఇష్టమొచ్చినట్టు ఆ యువతిని తిట్టేవాడు.
ఎప్పుడైతే ఆ యువతికి పెళ్లి ఫిక్సయిందో.. అప్పటి నుంచి వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయి. యువతి అత్తమామలకు గతంలో తనతో రిలేషన్ షిప్ లో ఉన్న ఫోటోలను పంపాడు. ఈ ఘటన తర్వాత మహిళ పెళ్లి రద్దు అయ్యింది. యువతి మేడిపల్లి పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిపై సైబర్ క్రైమ్, వేధింపుల చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే, ఈ సంఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుత సమాజంలో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని.. లేదంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుందని.. అమ్మాయి మారాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఎవరితో ఎంత స్నేహం చేయాలి..? ఎవరికి ఎంత వరకు స్పేస్ ఇస్తున్నాం..? అనే అంశాలతో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.