Weather News: ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణానికి సంబంధించి వింత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈసారి నైరుతి రుతుపవనాలు చాలా ముందుగానే వచ్చాయి. అయితే ఈసారి కొంచెం ముందుగానే వర్షాలు దంచికొట్టాయి. దీంతో రైతులు కూడా వ్యవసాయ పనుల్లో బిజీబిజీ అయిపోయారు. పలు జిల్లాల్లో పది రోజుల క్రితమే పత్తిగింజలు పెట్టడం పూర్తి చేశారు. కొందరు నార్లు కూడా పోశారు. మరి కొంత మంది రైతులు పొలాలను ఇప్పుడే చదును చేస్తున్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే గత మూడు, నాలుగు రోజు నుంచి మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో రైతులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు. పత్తి గింజలు పెట్టి వారం గడుస్తున్నా.. మళ్లీ వర్షాలు పడడం లేదని వరుణ దేవుడి వైపు చూస్తున్నారు. మొదట్లో వర్షాలు దంచికొట్టాయని.. ఇప్పుడేమో ఎండలు కొడుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ అలాగే తెలంగాణ వెదర్ మ్యాన్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతల్లో మరి కొద్ది సేపట్లో వర్షం దంచికొట్టనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని చెబుతున్నారు. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని చెబుతున్నారు. పిడుగులు పడే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షం పడుతున్నదని అధికారులు పేర్కొన్నారు.
ALSO READ: Honeymoon Couple: మరో హనీమూన్ జంట మాయం.. ఈ సారి మరింత దారుణం
ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ మరో అప్డేట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ రోజు రాత్రి, రేపు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, నిజామాబాద్, యాదాద్రి, ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఈ జిల్లాలకు రేపు ఉదయం వరకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతం అయ్యి ఉంటుందని అధికారులు వివరించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు.
ALSO READ: దక్షిణ రాష్ట్రాలకు భారీ వర్షం.. జాగ్రత్తగా ఉండండి
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడొద్దని సూచిస్తున్నారు. చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. రాబోయే ఈ రెండు రోజులు అత్యవసరం అయితే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్లొద్దని అధికారులు సూచించారు.