Weather News: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి వర్షాలు అంతగా కొట్టడం లేదు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఈసారి వర్షాలు సమృద్దిగా కురుస్తాయని రైతులు ముందస్తుగానే వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. మే నెల చివరి వారంలోనే పత్తి గింజలు, నార్లు పోశారు. అయితే ఆ తర్వాత రెండు వారాల నుంచి వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో వరుణ దేవుడి వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడెప్పుడు వర్షాలు పడుతాయా? అని ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, ఈ రోజు రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. హైదరాబాద్ లో చిరుజల్లులు పడగా.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాలతో పాటు కరీంనగర్ లో కూడా వర్షం పడింది. ఇక వరంగల్ రూరల్ ప్రాంతాలు పరకాల, నర్సంపేటతో పాటు భయ్యారం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేలికపాటి వర్షం పడింది.
ఈ క్రమంలో హైదారబాద్ వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రాగల 5 రోజుల వరకు వానలు కురుస్తాయని చెప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని సమీపంలోని ఉత్తరాంధ్ర తీరం, దక్షిణ ఒరిస్సా తీరం ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల మధ్యలో ఏర్పడినట్టు వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో భారీ వర్షాలు పడనున్నట్టు వివరించింది. రాబోయే ఐదు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, నిజామాబాద్, ఆసిఫాబాద్, కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వివరించింది.
ALSO READ: Watch video: మనాలీలో పర్యాటకులపై ఎలా దాడి చేశారో చూడండి.. 4 నెలల పసిపాపకు గాయాలు
రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులుతో కూడిన తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. అటు హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. దీంతో బయటకు వెళ్లేవారు అప్రమత్తతలో ఉండాల్సిన అవసరం ఉందని.. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్ర్తత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అక్కడక్కడ పిడుగులు పడే ఛాన్స్ ఉందని తెలిపారు.
ALSO READ: UPSC: యూపీఎస్సీలో భారీగా ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైనే వేతనం.. మరి కొన్ని రోజులే..!
అయితే.. ఉరుములు, పిడుగుల వర్షం ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడొద్దని సూచిస్తున్నారు. చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. రాబోయే ఈ రెండు రోజులు అత్యవసరం అయితే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్లొద్దని అధికారులు సూచించారు.