Weather News: తెలంగాణలో గతం వారం రోజుల నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరం వ్యాప్తంగా కూడా వర్షం దంచికొడుతోంది. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో కుండపోత వాన కురుస్తోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్న రేంజ్‌లో వాన పడుతున్నాయి. సాయంత్రం నుంచి మొదలవుతున్న వర్షం అర్ధరాత్రి 12 గంటల వరకు నాన్‌స్టాప్‌గా కురుస్తోంది. మొన్న ముషీరాబాద్‌లో అత్యధికంగా 18.45శాతం సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికమని అధికారులు చెబుతున్నారు. మెయిన్ రోడ్లు మొదలుకుని ఇంటర్నల్ రోడ్ల వరకు ఎక్కడ చూసినా చెరువులను తలపించాయి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లతో జనం నరకం చూస్తున్నారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కూడా ఏర్పడింది.
మరో నాలుగు రోజులు వర్షాలు..
తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేశారు. రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. అక్కడక్కడ పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని వివరించింది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని చెప్పింది.
రాత్రంతా ఈ జిల్లాల్లో దంచుడే..
ఈ రోజు రాత్రి పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగామ జిల్లాల్లో రాబోయే 24 గంటల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షం పడే అవకాశం ఉందని వివరించారు. ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని వివరించారు. హైదరాబాద్ లో సాయంత్రం, రాత్రి వేళల్లో తేలికపాటి వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
కాసేపట్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం..
మరి కాసేపట్లో కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వివరించారు. నార్త్, ఈస్ట్, సెంట్రల్ తెలంగాణల్లో జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.