Weather News: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, సిరిసిల్ల, వికారాబాద్‌జిల్లా తాండూర్‌లో, మణుగూరు, హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి.. అక్కడక్కడ కొన్ని కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు రాలేని స్థితిలో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బుధవారం తెల్లవారుజామున మొదలైన వర్షం.. నాలుగు గంటలపాటు కుండపోతగా కురిసింది. ఈ వర్షం ప్రభావంతో స్థానిక గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలోకి.. భారీగా వర్షపు నీరు చేరింది. వసతి గృహం నిండిపోయిన వరదనీటితో.. విద్యార్థినులు భయబ్రాంతులకు గురయ్యారు.
ఈ రోజు రాత్రి నుంచి దంచుడే దంచుడు…
హైదరాబాద్‌లో కూడా మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ట్రాఫిక్ వ్యవస్థ స్తంభించిపోయింది. ముఖ్యంగా మలక్‌పేట్, అబిడ్స్, కూకట్‌పల్లి, అమీర్‌పేట్ ప్రాంతాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. GHMC సిబ్బంది అత్యవసర చర్యలతో.. కొన్ని ప్రాంతాల్లో నీటిని తరలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది. తెలంగాణలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది. ఈ రోజు రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షం పడే ఛన్స్ ఉందని చెప్పింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ ఆలర్ట్, ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
పిడుగులు పడే ఛాన్స్…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతయాని చెప్పారు. ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని.. అక్కడక్కడ పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లా ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించారు.
ఏపీలో కూడా భారీ వర్షాలు..
ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు, కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిడుగులతో కూడిన వర్షాలు నేపథ్యంలో చెట్లు, టవర్స్, పోల్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో నిలబడొద్దని సూచించారు.
ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త..
రేపు, ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా కంచిలిలో 69 మిమీ, నర్సన్నపేటలో 62.5 మిమీ, కోటబొమ్మాళిలో 53.2 మిమీ, మందసలో 48.7 మిమీ, రాజాపురంలో 46.2 మిమీ, వజ్రపుకొత్తూరులో 40.7 మిమీ వర్షపాతం నమోదైందన్నారు.
ALSO READ: Indian Railways: వందేభారత్ ట్రైన్‌లో ఆహారం తినబోయాడు.. వామ్మో అంతలోనే..?
ALSO READ: Nandyal News: రాష్ట్రంలో మరో దారుణం.. భర్తను చంపేసి కారులో తీసుకెళ్లి..?