Heavy rains: రెండు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన నెలలో వర్షాలు అంతగా కొట్టలేదు. జూన్ నెలలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురిశాయి. ఈసారి వర్షాలు సమృద్దిగా కురుస్తాయని రైతులు ముందస్తుగానే వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. మే నెల చివరి వారంలోనే పత్తి గింజలు, నార్లు పోశారు. అయితే ఆ తర్వాత జూన్ నెల వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందారు.. ఎప్పుడెప్పుడు వర్షాలు పడుతాయా? అని ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, గత వారం రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. దీంతో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీ అయిపోయారు.
ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ (IMD) తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 115 mm నుంచి 205 mm వరకు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్రమైన వర్షపాతం, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది. ఈ వాతావరణ పరిస్థితి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తలెత్తుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ అల్పపీడనం వల్ల తీవ్రమైన వాతావరణ మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాలపై దీని ప్రభావం చూపనుంది.
ALSO READ: AP Govt: ఏపీ సర్కార్ వినూత్న ఆలోచన.. ఏఐతో దోమలకు చెక్.. అదెలా అంటే?
తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ వంటి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ వర్షాలు జూలై 9 నుంచి 11 వరకు కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ భారీ వర్షాల వల్ల వరదలు, ట్రాఫిక్ ఆటంకాలు, విద్యుత్ సరఫరా సమస్యలు తలెత్తే అవకావం ఉంది. అందువల్ల, ప్రజలు అత్యవసరం అయితేతనే తప్ప బయటకు రాకుండా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
ALSO READ: Jaggareddy: సీఎంను గెలకడం ఎందుకు? తిరిగి తన్నించుకోవడమెందుకు కేటీఆర్.. ఇక మారవా: జగ్గారెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం ఈ హెచ్చరికల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో అప్రమత్తత కొనసాగించాలని ఆదేశించింది. వరదలు సంభవించే ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉంచారు. అలాగే, వర్షం వల్ల రోడ్లు జలమయమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు అదనపు ఏర్పాట్లు చేశారు. రైతులకు కూడా తమ పంటలను కాపాడుకోవడానికి, సాగు నీటిని సరిగ్గా నిర్వహించుకోవాలని కీలక సూచనలు చేశారు. వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ, స్థానిక అధికారుల సూచనలను ప్రజలు పాటించాలని అధికారులు కోరారు. అత్యవసర సహాయం కోసం రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచింది.
అయితే.. రాష్ట్రంలో ఉరుములు, పిడుగుల వర్షం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడొద్దని సూచిస్తున్నారు. చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. రాబోయే ఈ రెండు రోజులు అత్యవసరం అయితే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్లొద్దని అధికారులు సూచించారు.