AP Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దోమల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఏఐ ద్వారా దోమల నియంత్రించేందుకు సరికొత్త ఆలోచనను తీసుకొచ్చింది. స్మార్ట్ మస్కిటో సర్వైలెన్స్ సిస్టమ్ (SMoSS) అనే అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ రాష్ట్రంలోని ఆరు ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లలో 66 ప్రాంతాల్లో అమలు కానుంది. విశాఖపట్నం (16), విజయవాడ (28), కాకినాడ (4), రాజమహేంద్రవరం (5), నెల్లూరు (7), కర్నూలు (6) నగరాల్లో ఇది అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమం దోమల వల్ల సంక్రమించే డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులను అరికట్టడంతో పాటు, ప్రజారోగ్యాన్ని కాపాడటం, పౌర సిబ్బంది పనిభారాన్ని తగ్గించడం, ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సిస్టమ్‌లో AI ఆధారిత సెన్సార్లు, డ్రోన్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) పరికరాలు, హీట్ మ్యాప్‌లు, ట్రాప్‌లు వంటివి ఉపయోగించనున్నారు. ఈ సెన్సార్లు దోమల జాతులు, లింగం, సాంద్రత, ఉష్ణోగ్రత, ఆర్ద్రత వంటి సమాచారాన్ని సేకరిస్తాయి. దోమల సాంద్రత పరిమితిని దాటితే, సిస్టమ్ ఆటోమేటిక్ అలర్ట్‌లను పంపి, ఆ ప్రాంతంలో వెంటనే ఫొగ్గింగ్ లేదా స్ప్రేయింగ్ చేయడానికి సిబ్బందిని సిద్ధం చేస్తుంది. ఈ డేటా రియల్ టైమ్‌లో సెంట్రల్ సర్వర్‌కు చేరి, డాష్‌బోర్డ్‌పై విజువలైజ్ అవుతుంది. ఇది ఇప్పటి వరకు జరిగే ‘బ్లైండ్ స్ప్రేయింగ్’ విధానాన్ని నివారించి, డేటా ఆధారిత, ఖచ్చితమైన చర్యలను అమలు చేస్తుంది.
ALSO READ: Bharat Bandh: రేపు భారత్ బంద్.. స్కూళ్లు, బ్యాంకులకు సెలవు ఉంటుందా?
డ్రోన్ల ద్వారా లార్విసైడ్ స్ప్రే చేయడం వల్ల తక్కువ రసాయనాలతో, తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో పెద్ద ప్రాంతాలను కవర్ చేయవచ్చు. అలాగే, ఆస్పత్రుల నుంచి రోజువారీ డెంగీ, మలేరియా కేసుల రిపోర్టులను సేకరించి, దోమల హాట్‌స్పాట్‌లను గుర్తించి, లక్షిత చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ వినూత్న విధానం వర్షా కాలంలో దోమల సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు, రాష్ట్రంలో AI ఆధారిత గవర్నెన్స్‌ను ప్రోత్సహిస్తోంది.
ఈ కార్యక్రమం జులై 2025లో ప్రారంభం కానుంది. ఇది భారతదేశంలో తొలి పెద్ద ఎత్తున AI ఆధారిత దోమల నియంత్రణ వ్యవస్థగా నిలుస్తుంది. రాష్ట్ర ప్రజలకు సురక్షిత, ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించడంలో ఈ సిస్టమ్ కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు ఆశిస్తున్నారు.