Cab Driver Murder: హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన క్యాబ్ డ్రైవర్ హత్య కేసు మిస్టరీని పటాన్ చెరు పోలీసులు ఛేధించారు. ఈ దారుణానికి పాల్పడ్డ వారిలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ముంబయిలోని నగల దుకాణాల్లో దోపిడీలు చేసేందుకు ఈ గ్యాంగ్ కుట్రలు చేసినట్టుగా విచారణలో వెల్లడైంది. అక్కడికి వెళ్లి రావటానికి కారు అవసరంకాగా ఈ క్రమంలోనే క్యాబ్ డ్రైవర్ ప్రాణం తీసినట్టుగా నిర్ధారణ అయ్యింది. ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలను శేరిలింగంపల్లి జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల 11న సంగారెడ్డి జాతీయ రహదారిపై రుద్రారం గ్రామ శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురై కనిపించాడు. విచారణలో హతుడు క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ అని నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో నిందితుల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. వందల సంఖ్యలో సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించాయి. వాటిని విశ్లేశించగా ఈనెల 10న అర్ధరాత్రి నిందితులు సికింద్రాబాద్ ఎస్పీ రోడ్డులోని టాస్క్ ఫోర్స్ కార్యాలయం సమీపంలో రాజశేఖర్ క్యాబ్‌ను అద్దెకు తీసుకున్నట్టు తేలింది. లభించిన ఆధారాలతో గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు.. హత్య చేసిన గ్యాంగ్ లోని రాహుల్ (29), సూరజ్ శశికాంత్ (29), బాంబే రాజు రామచంద్ర (32)లను అరెస్ట్ చేశారు.
నిందితులను పోలీసులు తమదైన శైలిలో విచారించగా కీలక విషయాలు బయటపడ్డాయి. ముంబయి వెళ్లాలని చెప్పి తొలుత నిందితులు క్యాబ్ ను మాట్లాడుకున్నట్టుగా తెలిసింది. రుద్రారం శివారుకు చేరుకున్న తర్వాత రాజశేఖర్‌పై దాడి చేసి టవల్‌తో గొంతు బిగించి హత్య చేసినట్లు వెల్లడైంది. అనంతరం మృతదేహాన్ని నిర్మాణంలో ఉన్న ఆర్వోబీ సమీపంలో పడేసి కారులో ముంబై వైపు పరారయినట్టు తెలిసింది. అయితే దారిలో కోహీర్ సమీపంలో కారు ఇంజన్ చెడిపోవటంతో దానిని గోల్డెన్ ధాబా వద్ద వదిలిపెట్టి జహీరాబాద్ వైపు వెళ్లినట్టు వెల్లడైంది.
Also Read: స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా
తొలుత పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో బీఎన్ఎస్ చట్టం సెక్షన్ 103(1) ప్రకారం హత్యగా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో కీలక ఆధారాలు లభించడంతో హత్యతో పాటు నేరపూరిత కుట్రకు సంబంధించిన సెక్షన్లను పోలీసులు జోడించారు. దర్యాప్తులో వెల్లడైన మరిన్ని వివరాల ప్రకారం అయిదుగురు నిందితులకు సికింద్రాబాద్‌లో పరిచయం ఏర్పడింది. క్యాబ్‌ను అద్దెకు తీసుకుని డ్రైవర్‌ను హత్య చేయడం, కారును అపహరించడం, అనంతరం ముంబై వెళ్లి బంగారు దుకాణాల్లో చోరీలకు పాల్పడాలని నిందితులు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
Also Read: టీజీఈజేఏసీ ఉద్యోగుల డిమాండ్లపై తేలని పంచాయితీ.. రెండు డీఏలపై సర్కార్ క్లారిటీ!