⦿ కేటీఆర్ అరెస్ట్‌పై ఉత్కంఠ
⦿ ఫార్ములా ఈ-రేస్ ఎఫ్ఐఆర్‌పై నేడు విచారణ
⦿ నేటి దాకా అరెస్టు కాకుండా కేటీఆర్‌కు ఊరట
⦿ ఆ సడలింపును ఎత్తివేయాలంటూ ఏసీబీ పిటిషన్
⦿ విచారణ తర్వాత ఉత్తర్వులివ్వనున్న హైకోర్టు
⦿ ఇప్పటికే ఫెమా ఉల్లంఘనలపై ఈడీ నోటీస్
⦿ హైకోర్టు తీర్పు అనంతరం ఏసీబీ కార్యాచరణ
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ :
Hyderabad Formula E Race Case: ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో ఏసీబీ అరెస్టు చేయకుండా కేటీఆర్‌కు హైకోర్టు ఇచ్చిన ఉపశమనం డిసెంబరు 31తో (నేటి) ముగియనుంది. ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగనుంది. ‘నాట్ టు అరెస్ట్’ ఉత్తర్వులను ఎత్తేయాలంటూ ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్‌పైనా కోర్ట్ విచారణ జరపనుంది. అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ గత విచారణ సందర్భంగా ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు మరిన్ని రోజులు పొడిగిస్తుందా?.. లేక పూర్తిగా ఎత్తివేస్తుందా?.. అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఉత్తర్వుల ఆధారంగా ఏసీబీ తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనుంది. ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయలేమని గత విచారణ సందర్భంగా స్పష్టత ఇచ్చిన హైకోర్టు… దర్యాప్తును యథాతథంగా కొనసాగించవచ్చంటూ ఏసీబీ అధికారులను ఆదేశించింది.
అదే సమయంలో విచారణకు సహకరించాలంటూ కేటీఆర్‌కు స్పష్టం చేసింది. విచారణలో భాగంగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్‌ను ఎంక్వైరీ చేసిన ఏసీబీ అధికారులు ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఈ కేసులో ఏ-1గా పేర్కొన్న కేటీఆర్‌తో పాటు ఏ-2, ఏ-3లుగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. హైకోర్టు విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకోవాలని ఏసీబీ భావిస్తోంది.
మరోవైపు విదేశీ మారక ద్రవ్య చట్ట (ఫెమా) ఉల్లంఘనలు జరిగిందనే ప్రాథమిక నిర్ధారణలో భాగంగా జనవరి 7న విచారణకు హాజరయ్యేలా కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి, 2, 3 తేదీల్లో ఐఏఎస్ అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలు ఎంక్వయిరీకి రావాల్సిందిగా నోటీసులు జారీచేసింది. తొలుత ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసింది ఏసీబీ అయినప్పటికీ నోటీసులు జారీచేసే విషయంలో మాత్రం ఈడీ దూకుడుతో ఉన్నది.
హైకోర్టు మంగళవారం జరిపే విచారణ కీలకం కానుంది. కేటీఆర్ సహా ముగ్గురు నిందితులకు నోటీసులు జారీ చేయడంపై ఏసీబీ అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ హైకోర్టు గతంలో వెలువరించిన ఉత్తర్వులపైనే మంగళవారం జరిగే విచారణకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. కేటీఆర్‌కు రిలీఫ్ దక్కుతుందా?.. లేక ఏసీబీ ప్రాసిక్యూషన్‌కు లైన్ క్లియర్ అవుతుందా?.. ఈ అంశాలే ఉత్కంఠ రేపుతున్నాయి. ఎఫ్ఐఆర్ కొట్టివేస్తే ఈడీ నోటీసులకు అర్థం ఉండదని కేటీఆర్ ఒకింత ధీమాతో ఉన్నారు.
Also Read: CM Revanth – CM Chandrababu: సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు.. అసలు విషయం ఇదే!
హైకోర్టు వెలువరించే ఉత్తర్వులతో ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుందోననే ఆసక్తి మొదలైంది. ఏక కాలంలో ఏసీబీ, ఈడీ రంగంలోకి దిగడంతో కేటీఆర్‌ను మొదట అరెస్టు చేసేది ఏ దర్యాప్తు సంస్థ అనే గుసగుసలు కూడా అటు బీఆర్ఎస్ లీడర్లతో పాటు రాష్ట్రంలోని ఇతర పార్టీల నేతలు, సామాన్య ప్రజానీకంలో నెలకొంది. కేసులకు భయపడేది లేదంటూనే హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం, లీగల్‌గా ఎదుర్కొంటామన్న ధీమాను వ్యక్తం చేయడంతో మంగళవారం ఎలాంటి ఉత్తర్వులను హైకోర్టు వెలువరిస్తుందనేది కీలకంగా మారింది