Ganesh Immersion Tragedy: గణేశ్ నిమజ్జన శోభయాత్ర వేళ హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి నగర శివార్లలోని కండ్లకోయ వద్ద విగ్రహాన్ని తరలిస్తున్న క్రమంలో ఈ విషాదం జరిగింది. ఓ డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో విగ్రహం సైతం ధ్వంసమైంది. దీంతో స్థానికులు అప్రమత్తమై క్షతగాత్రులను హుటాహుటీనా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
అంతకుముందు శుక్రవారం ఉదయం కూడా గణేశ్ శోభాయాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ జంక్షన్ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్రలో పాల్గొనడానికి వచ్చిన ఆ వ్యక్తి.. ప్రమాదవశాత్తు వాహనం కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మెట్రో పిల్లర్ నెంబర్ 1167 సమీపంలో ఈ ఘటన జరిగింది. అయితే పోలీసుల అత్యుత్సాహం వల్లే ఈ ఘటన జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా 10 రోజుల పాటు జరిగిన గణేశ్ ఉత్సవాల్లో మెుత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వేర్వేరు ఘటనల్లో వీరంతా ప్రమాదానికి గురై మరణించారు. మరో 26 మందికి గాయాలు అయ్యాయి. మృతుల్లో కొత్తగూడెం ఎస్ఐ వెంకన్న సైతం ఉన్నారు. హైదరాబాద్ లో జరిగిన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు పటాన్ చెరు వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు యువకులు మృతి చెందగా.. నిర్మల్ ఊరేగింపు సమయంలో మరొకరు గుండెపోటుతో మరణించారు. గాయపడ్డ వారిలో ఒక్క మల్కాజిగిరి పరిధిలోనే 17 మంది ఉన్నారు.
Also Read: 32 పళ్లు బయటపెట్టి నవ్వుతూ…బాబర్ తిడుతూ టీమిండియాను మెచ్చుకుంటున్నారు
అయితే అక్కడక్కడా కొన్ని విషాద ఘటనలను మినహాయిస్తే.. హైదరాబాద్ తో పాటు యావత్ తెలంగాణలో వినాయక నిమజ్జన వేడుకలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. ఒక్క హైదరాబాద్ లోనే 25వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు డీజీపీ సి.వి ఆనంద్ తెలిపారు. ఇందులో 15,000 మంది స్థానిక సిటీ పోలీసులు కాగా, మిగిలిన 10,000 మందిని జిల్లాల నుంచి ప్రత్యేకంగా రప్పించినట్లు పేర్కొన్నారు.
Also Read: నిజామాబాద్ మున్సిపల్ ఆఫీస్‌లో లంచాల దందా కలకలం