GHMC rain update: హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోతున్నాయి. నగరంలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ట్రాఫిక్ స్థంభించిపోగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు సీరియస్‌గా స్పందించారు.
భారీ వర్షాల నేపథ్యంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుండే టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, మున్సిపల్, జల, విద్యుత్, సమాచార శాఖల అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, విద్యుత్ శాఖ సీఈఓ ముష్రాఫ్ అలీ, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ ప్రియాంకతో పాటు 3 పోలీస్ కమిషనరేట్ లు, 3 జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.
సి.ఎస్ రామకృష్ణ రావు మాట్లాడుతూ.. నగరంలో కొన్ని ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతోంది. రాత్రంతా వర్షం పడే సూచనలు ఉన్నాయి. కనుక ప్రతి అధికార శాఖ అప్రమత్తంగా ఉండాలి. ప్రాణనష్టం ఏమీ జరగకూడదు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని హెచ్చరించారు.
ఐటీ కారిడార్, పంజాగుట్ట, బంజారాహిల్స్ హై అలర్ట్
వర్షం కారణంగా ముఖ్యంగా హైటెక్ సిటీ, ఐటీ కారిడార్ ప్రాంతాల్లో వరదనీటి నిలిచే సమస్యలు రిపోర్టవుతున్నాయి. టివీ9, టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీసుల సమీపం, షేక్‌పేట్, రాజ్‌భవన్ ప్రాంతాలు జలమయంగా మారాయి. ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోవడంతో, ప్రజలకు నరకం అనుభూతి కలుగుతోంది. పంజాగుట్ట రోడ్డు పూర్తిగా జామ్ కావడంతో, ట్రాఫిక్ పోలీసులు ఆ దిశగా రాకుండా, ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచిస్తున్నారు. లక్డీకాపూల్ నుండి పంజాగుట్ట, బంజారాహిల్స్ నుండి తాజ్ డెక్కన్ వైపు వెళ్లే వారు మరల ప్రయాణాన్ని పునరాలోచించాలి.
250 టీమ్స్, HYDRAA.. ఫీల్డ్ లో యాక్షన్ లోకి
GHMC, HYDRAA, NDRF, SDRF సిబ్బందితో కలిపి 250 ప్రత్యేక టీములు నగరంలో పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి వాటర్ లాగింగ్ పాయింట్‌ను మ్యాప్ చేసి, వెంటనే నీరు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు వెంటనే ఫిర్యాదులు నమోదు చేయగలిగేలా జీహెచ్ఎంసీ, కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు.
విద్యుత్ సమస్యలు 250కు పైగా.. అధికారి సమీక్ష
ఈ భారీ వర్షాల వల్ల 250కు పైగా విద్యుత్ సంబంధిత సమస్యలు రిపోర్టయ్యాయి. ఇప్పటికే 149 సమస్యలు పరిష్కరించామని, మిగతావి త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ముఖ్యంగా విద్యుత్ స్తంభాల సమీపంలో వర్ష సమయంలో వెళ్లరాదని ప్రజలను హెచ్చరించారు.
Also Read: Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..
వర్షాల వల్ల రికార్డు వర్షపాతం..
గచ్చిబౌలి – 12.5 సెం.మీ
ఖాజాగూడ – 12 సెం.మీ
ఎస్‌ఆర్ నగర్ – 11.1 సెం.మీ
ఖైరతాబాద్ – 10.09 సెం.మీ
యూసుఫ్‌గూడ – 10.4 సెం.మీ
ఉప్పల్ – 10 సెం.మీ
బంజారాహిల్స్ – 9 సెం.మీ
నాగోల్ – 8.8 సెం.మీ
ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి – అప్రమత్తంగా ఉండండి!
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అత్యవసరం కాకుండా ఎవరూ బయటకు రావొద్దని సి.ఎస్ రామకృష్ణారావు సూచించారు. డ్రైనేజీల మూతలు ఎవరూ తొలగించరాదని, విద్యుత్ లైన్ల సమీపంలో ఉండొద్దని, ఎటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో తక్షణమే కంట్రోల్ రూమ్‌లను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
ట్రాఫిక్ కిలోమీటర్ల వరకు నిలిచిన దృశ్యం
చాదర్‌ఘాట్ నుండి ఎల్బీ నగర్ వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడం, ఉప్పల్, అమీర్‌పేట్, బేగంపేట్ ప్రాంతాల్లో వాహనదారుల ఇబ్బందులు.. నగర వాసులకు భయానక అనుభూతిని కలిగిస్తున్నాయి. నగర రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల బైకులు, కార్లు వరద నీటికి కొట్టుకుపోయాయి.
తీవ్రమవుతోన్న వర్ష ప్రభావం.. ప్రభుత్వం రెడీ
ఈ సంక్షోభ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, GHMC, పోలీస్, జలమండలి, విద్యుత్ శాఖలు అన్ని యంత్రాంగాలు సమన్వయంగా పనిచేస్తున్నాయని, ప్రజలు ప్రభుత్వ సూచనలను పాటిస్తూ, భద్రతగా ఉండాలని అధికారుల విజ్ఞప్తి.