Ibrahimpatnam Murder: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగుచూసిన మహిళ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును ఛేదించిన పోలీసులు, నిందితుడు షఫియే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. భవానీపురానికి చెందిన షఫికి, మృతురాలు కళ్యాణితో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఆమె కుమారుడిని కూడా షఫియే పెంచుతున్నాడు. అయితే, ఇటీవలి కాలంలో వీరిద్దరి మధ్య డబ్బు విషయమై తీవ్ర మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది.
డబ్బు కోసం బెదిరింపులే కారణమా?
కళ్యాణి తరచూ డబ్బులు కావాలని షఫిపై ఒత్తిడి తెచ్చేదని, డబ్బులివ్వకపోతే అత్యాచారం కేసు పెడతానని బెదిరించేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 17న ఆమె రూ.20 వేలు ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేసింది. దీంతో విసిగిపోయిన షఫి, కళ్యాణిని భవానీపురంలోని తన ఇంటికి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు.
ముక్కలుగా నరికి కెనాల్‌లోకి..
హత్య చేసిన అనంతరం షఫి, తన మటన్ షాపులో పనిచేసే గురువులు అనే వ్యక్తికి సమాచారం ఇచ్చాడు. ఇద్దరూ కలిసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి, వాటిని బ్యాగుల్లో నింపారు. అనంతరం ఆ బ్యాగులను గొల్లపూడి సమీపంలోని కూలింగ్ కెనాల్లో పడేసి ఏమీ తెలియనట్లు మాయమయ్యారు.
మరికొందరి పాత్రపై పోలీసుల విచారణ
ఈ కేసులో ప్రధాన నిందితులతో పాటు, కళ్యాణికి సన్నిహితంగా ఉండే బంగారం షాప్ యజమాని దామోదర్, కరీం హోటల్ గౌస్, ఆల్ఫా హోటల్ అదానీ అలీల పాత్రపై కూడా పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు. కేసుకి సంబంధించిన అన్ని కోణాలను విశ్లేషిస్తూ దర్యాప్తు వేగవంతం చేశారు.
Also Read: డిజిటల్ తెలంగాణలో లైవ్ స్టాక్ చీకట్లు.. ఏళ్లు గడుస్తున్నా లేని వెబ్‌సైట్!