TSLDA Website: స్వేచ్చ బ్యూరో: డిజిటల్ యుగంలో అడుగుపెట్టామని, ప్రతి సేవనూ ప్రజలకు ఆన్‌లైన్ ద్వారా చేరువ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది.. ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు సైతం ఆదేశాలు జారీ చేస్తుంది. కానీ.. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు పొంతన కుదరడం లేదు.. పశుసంవర్ధక రంగంలో కీలకమైన ‘తెలంగాణ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ’ (TSLDA) పరిస్థితి చూస్తే అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఏళ్లు గడుస్తున్నా ఈ ఏజెన్సీకి కనీసం ఒక అధికారిక వెబ్‌సైట్ కూడా లేకపోవడం పశుపోషకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. అంతేకాదు అధికారుల పనితీరును సైతం స్పష్టం చేస్తుంది.
ఏళ్లు గడుస్తున్నా లేని వెబ్‌సైట్!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి ఇప్పటివరకు టీఎస్ఎల్డీఏకు ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీని 1999 -2000 సంవత్సరంలో నోడల్ ఏజెన్సీగా అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వ జాతీయ పశువుల జనన ప్రాజెక్టు ( నేషనల్ ప్రాజెక్ట్ ఫర్ క్యాటిల్ బ్రీడింగ్ ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఉనికిలోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆవులు గేదెల లో కృత్రిమ గర్భధారణ విస్తృతం చేయడం, పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడం, మేలురకం పశువుల వీర్య నాలికల ఉత్పత్తి కోసం అధునాతన ప్రొజెన్ సెమెన్ బుల్ స్టేషన్లు, గోపాలమిత్ర పేరుతో పశువుల పెంపకం దారుల ముంగిటకే సేవలందించే విప్లవాత్మక విధానాన్ని ఈ ఏజెన్సీ ద్వారానే ప్రారంభించారు. దీంతో పశు పెంపకదారులకు నాణ్యమైన సేవలందితున్నాయి.
కనీస సమాచారం కూడా కరువు
పశుగ్రాసం అభివృద్ధి, కృత్రిమ గర్భధారణ, జాతి అభివృద్ధి పెంపకం, మరియు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ రాయితీ పథకాలు వంటి అనేక కార్యక్రమాలను ఈ ఏజెన్సీ పర్యవేక్షిస్తుంది. కానీ, ఇవేవీ రైతులకు సకాలంలో చేరడం లేదు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టే జీవాల పెంపకం, పాడి పరిశ్రమ అభివృద్ధి పథకాల వివరాలు ఎక్కడా అందుబాటులో లేవు. ఏ పథకానికి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి? అర్హతలు ఏమిటి? అనే కనీస సమాచారం తెలియక రైతులు తీరా ఇబ్బందులు పడుతున్నారు.
ఫిర్యాదులకు వేదిక లేక..
పశువుల ఆరోగ్య సమస్యలు, నాణ్యత లేని దాణా లేదా సేవలలో లోపాలపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా ప్రదక్షిణలు గ్రామీణ ప్రాంతాల నుంచి పశుపోషకులు తమ చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం, సమాచారం కోసం జిల్లా మరియు రాష్ట్ర స్థాయి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. రోజువారీ కూలీని వదులుకుని, ప్రయాణ ఖర్చులు భరించి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల అలసత్వం.. మూలన పడుతున్న డిజిటలైజేషన్
రాష్ట్రంలోని మిగతా అన్ని శాఖలకు ప్రత్యేక వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లు ఉన్నప్పటికీ.. రైతుల ఆర్థికాభివృద్ధిలో కీలకమైన లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీకి ఇంతవరకు వెబ్‌సైట్ లేకపోవడం వెనుక అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత శాఖాధికారులు స్పందించి వెంటనే టి ఎస్ ఎల్ డి ఏ కి ఒక పటిష్టమైన వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని, ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తులు మరియు ఫిర్యాదుల స్వీకరణకు శ్రీకారం చుట్టాలని పశుపోషకులు డిమాండ్ చేస్తున్నారు.
పూర్తిస్థాయి సీఈవో లేక ఇక్కట్లు
తెలంగాణ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీకి సీఈవో గా సుబ్బారాయుడు ఉన్నప్పటికీ.. ఆయనకు మరో నాలుగు శాఖలు ఉండటంతో పూర్తిస్థాయిలో ఈ శాఖపై దృష్టి సారించడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. శాఖలోని ఫైల్స్ సైతం ముందుకు సాగడం లేదని.. పశుపోషకులకు సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడంలో.. ప్రత్యేక వెబ్ సైట్ ను తీసుకురావడంపై సైతం దృష్టి సారించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఆయనే ముందుండి వెబ్సైట్ను రూపకల్పన చేయించాల్సి ఉన్నప్పటికీ ఇతర శాఖ బాధ్యతలు సైతం ఉండడంతో జపం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వం పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తామంటోంది.. కానీ మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. కనీసం ఆన్‌లైన్‌లో చూసుకుందామంటే వెబ్‌సైటే లేదు. ప్రతీ చిన్న దానికి అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
Also Read: కిషన్ రెడ్డి ప్లాన్ వర్కవుట్ అవుతుందా? ఖైరతాబాద్ పోరులో కమలం టాప్ గేర్!