Cyber Fraud: సోషల్ మీడియాలో ప్రముఖుల పేర్లను వాడుకుంటూ సైబర్ నేరగాళ్లు అమాయకులను నిలువునా దోచేస్తున్నారు. తాజాగా ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పేరుతో సృష్టించిన నకిలీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌తో జగిత్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడు ఇరాక్‌లో ఉండగా మోసం చేసి రూ. 87,000 కాజేశారు.
వివరాల్లోకి వెళితే… జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం బట్టపల్లి పోతారం గ్రామానికి చెందిన రాకేష్, తీవ్రమైన అప్పుల కారణంగా జీవనోపాధి కోసం కేవలం పది రోజుల క్రితమే ఇరాక్‌కు వెళ్లాడు. అక్కడ ఫేస్‌బుక్ వాడుతుండగా, ‘యూట్యూబర్ హర్ష సాయి’ పేరుతో ఉన్న ఒక పోస్ట్‌ను లైక్ చేశాడు. హర్ష సాయి తరచుగా పేదలకు ఆర్థిక సహాయం చేస్తుండటంతో, రాకేష్ కూడా ఆ పోస్ట్ పట్ల ఆకర్షితుడయ్యాడు.
దీన్నే అదనుగా భావించిన సైబర్ ముఠా సభ్యులు, తాము హర్ష సాయి టీమ్ అని, అతని సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తామని రాకేష్‌తో ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా పరిచయం పెంచుకున్నారు. . రాకేష్ నమ్మకాన్ని పూర్తిగా పొందడానికి, మోసగాళ్లు హర్ష సాయి పేరుతో ఉన్న నకిలీ ఆధార్ కార్డు కాపీని అతనికి పంపించారు.
ఆ తర్వాత, “మీరు అప్పుల్లో ఉన్నారని తెలిసింది. మీకు సహాయం చేయడానికి హర్ష సాయి ఐదు లక్షలు (రూ.5,00,000) పంపాలనుకుంటున్నారు” అని రాకేష్‌కు ఆశ చూపారు. కొద్దిసేపటికే, తాము రూ. 6.5 లక్షలు ఫోన్‌పే ద్వారా పంపినట్లు ఒక నకిలీ స్క్రీన్‌షాట్‌ను సృష్టించి రాకేష్‌కు పంపించారు. అయితే, తన ఖాతాలో డబ్బు జమ కాకపోవడంతో రాకేష్ వారిని ప్రశ్నించాడు.
READ ALSO: USSD fraud: సైబర్ మోసగాళ్ల కొత్త మోసం.. మీ కాల్స్, ఓటీపీలు నేరుగా వారికే.. జాగ్రత్త!
అసలు మోసం ఇక్కడే మొదలైంది. “ఈ ఫండ్ విదేశీ మారకం ద్వారా వస్తోంది. కాబట్టి అది విడుదల కావాలంటే మీరు కొంత ‘ప్రాసెసింగ్ ఫీజు’తో పాటు ‘టాక్స్’ చెల్లించాలి” అని నమ్మబలికారు. వారి మాటలు గుడ్డిగా నమ్మిన రాకేష్, ఇండియాలోని తన కుటుంబ సభ్యులు, స్నేహితుల ఖాతాల నుండి విడతల వారీగా మొత్తం ₹87,000 వారి బ్యాంకు ఖాతాలకు (ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా) పంపించాడు.
అయినా ఆ ముఠా డబ్బుల కోసం డిమాండ్ చేయడం ఆపలేదు. రాకేష్ డబ్బు పంపడం ఆపడంతో, మోసగాళ్లు తమ నిజ స్వరూపం బయటపెట్టారు. “నువ్వు మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నావు. వెంటనే మిగిలిన డబ్బు చెల్లించకపోతే ‘డిజిటల్ అరెస్టు’ చేస్తాం. నీపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని బెదిరింపులకు దిగారు. రాకేష్‌ను భయపెట్టేందుకు కొన్ని మార్ఫింగ్ చేసిన వీడియోలను, నకిలీ అరెస్ట్ వారెంట్లను కూడా పంపారు. చివరకు తాను దారుణంగా మోసపోయానని గ్రహించిన బాధితుడు రాకేష్, తనకు న్యాయం చేయాలని ఇరాక్ నుండే మీడియాను ఆశ్రయించాడు. అప్పులు తీర్చడానికి దేశం వదిలి వెళితే, ఉన్న అప్పులకు తోడు ఈ మోసం తనను మరింత కుంగదీసిందని ఆవేదన వ్యక్తం చేశాడు.