Jaipal Reddy: ప్రత్యేక తెలంగాణ కల సాకారంలో కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి పాత్ర చిరస్మరణీయమని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఇవాళ దివంగత కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి 83వ జయంతి. ఈ సందర్భంగా ఉత్తమ పార్లమెంటేరియన్ సూదిని జైపాల్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని గురువారం ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
తెలంగాణలో సాధారణ పల్లె నుంచి ఢిల్లీ దాకా సాగిన ఆయన ప్రస్థానంలో నైతిక విలువలకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో, పార్లమెంట్ ఉభయ సభల్లో బలమైన గళం వినిపించారని సీఎం పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, బెల్లంపల్లి, పరిగి ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నాయకులు రోహిన్ రెడ్డి, విద్యాసాగర్ పాల్గొన్నారు.
జైపాల్ రెడ్డి ప్రస్థానం..
సూదిని జైపాల్ రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా, మాడుగులలో జన్మించారు. 18 నెలల వయస్సులోనే పోలియో వ్యాధి కారణంగా వైకల్యానికి గురయ్యారు. జైపాల్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎమ్ఏ పట్టా పొందాడు. నీతి, నిజాయితీ ఆయన సొంతం. అవినీతి మరక అంటని గొప్ప నాయకుడు. అందుకే రాజకీయాల్లో అలుపెరగని యోధుడిగా ఆయన ప్రస్థానం కొనసాగింది. పార్టీలకు అతీతంగా నేతలతో చనువు పెంచుకున్న, ప్రేమను పంచుకున్న మహా గొప్ప లీడర్ జైపాల్ రెడ్డి అంటే అతిశయోక్తి కాదేమో. కాంగ్రెస్ పార్టీతో పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన జైపాల్ రెడ్డి.. ఎమర్జెన్సీ సమయంలో కొన్ని కారణాలతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి జనతా పార్టీలో చేరారు.
Also Read: APCOB Jobs: గుడ్ న్యూస్.. ఈ జిల్లాల్లో ఉద్యోగాలు.. ఇంకా వారం రోజులే గడువు
జైపాల్ రెడ్డి 1969 నుంచి 1984 వరకు నాలుగు సార్లు ఆంధ్రప్రదేశ్ శాసన సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయిన జైపాల్ రెడ్డి.. అత్యవసర పరిస్థిితిని వ్యతిరేకించి తర్వాత బీజేపీ చేరారు. ఆయన పార్లమెంట్‌కు మొదటిసారిగా 1984లో మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా 1999, 2004లో మిర్యాల గూడ నియోజకవర్గం నుంచి రెండు సార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యునిగా 1999, 1996లో ఎన్నికయ్యారు. 1991-92లో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా వ్యవహరించారు. రెండు సార్లు సమాచార, ప్రసార శాఖా మంత్రిగా పని చేశారు. 1998లో అత్యుత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం కూడా అందుకున్నారు.