Farmer Issues: స్వేచ్చ బ్యూరో: వ్యవసాయరంగాన్ని, రైతులను రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా ఎగ్గొట్టటంతో పాటు వారి నుంచే తరుగు పేరుతో వెయ్యి కోట్లకు పైగా కప్పం కట్టించుకున్న సిగ్గులేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమన మండిపడ్డారు. నల్గొండ లో ఏర్పాటు చేసిన రైతు సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత మాట్లాడారు. ప్రభుత్వానికి ఉక్కు సంకల్పం ఉంటే వ్యవసాయ రంగంలో అద్భుతాలు చేయవచ్చని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యవసాయ శాఖపై రేవంత్ రెడ్డి కనీసం రివ్యూ చేయలేదని విమర్శించారు. రైతులకు మేలు జరగాలంటే వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి పారిశ్రామిక వేత్తలకు ఇచ్చిన సౌకర్యాలు కల్పించాలని కవిత డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి సర్కార్ లో రైతులు విలవిలలాడుతున్నారని కవిత అన్నారు. రైతు రుణమాఫీ కాక, రైతు భరోసా రాక, యూరియ లేక, ధాన్యం కొనుగోళ్లు లేక, సాగు నీళ్లు లేక అవస్థలు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు మేలు చేయాల్సి ఉండగా సిగ్గు లేకుండా ఉల్టా వారి నుంచే కప్పం కట్టించుకుంటున్నారని అన్నారు. క్వింటాల్ కు 6 కిలోల తరుగు తీస్తూ, రవాణా ఛార్జీలు రైతులపైనే వేస్తూ దాదాపు 12 వందల కోట్లు రైతుల నుంచి వసూలు చేయటం దారుణమని కవిత అన్నారు. రైతుల కష్టాలను తీర్చాల్సిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు వ్యవసాయ శాఖపై కనీసం ఒక్కసారి కూడా రివ్యూ చేయలేదన్నారు. బకాయి పడిన రైతు భరోసా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 36 శాతం మంది కౌలు రైతులే ఉన్నారని వారిని గుర్తించి రైతు భరోసా ఇవ్వాలని కవిత కోరారు. రైతు కూలీలకు కూడా ప్రభుత్వం ఇస్తామన్న 12 వేలు ఇవ్వాలన్నారు. రాజకీయ అవసరాలు ఉన్నప్పుడే మాత్రమే రైతు భరోసా వేస్తామంటే రైతులు అన్ని విషయాలు గమిస్తారని సరైన సమయంలో బుద్ది చెబుతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో రైతులు సాగు నీరు లేక ఇబ్బంది పడుతున్నారని కవిత అన్నారు. ఇక్కడ రిజర్వాయర్లు కట్టాలని కోరినప్పటికీ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ రిజర్వాయర్లు ఉంటే నల్గొండ లో కాలువలు ఉన్నాయన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ లో భాగంగా పాలమూరు నీళ్లు వచ్చే అంశమే తప్ప నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు నీళ్లిచ్చే అంశాన్ని ముఖ్యమంత్రి మాట్లాడటం లేదని కవిత విమర్శించారు.
Also read: ఫ్యూచర్ సిటీపై హరీశ్‌వి మళ్లీ అవే మాటలు! అమరావతిలా వివాదస్పదం చేసేందుకు బీఆరెస్ యత్నం!
నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు నీళ్లిచ్చే ఏర్పాట్లు చేయాలన్నారు. దిండి ప్రాజెక్ట్ సోర్స్ పాయింట్ ను మార్చి నల్గొండ, పాలమూర మధ్య వివాదం లేకుండా చేయాలన్నారు. అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అసైన్డ్ భూములను పరిశ్రమ పేరుతో లాక్కుంటుందని మండిపడ్డారు. జిల్లాకు చెందిన మంత్రి ఒకరు వందల ఎకరాల అసైన్డ్ భూములను కొని పెట్టుకుంటున్నారని ఎన్నికల చివరి ఏడాది అసైన్డ్ భూములకు ప్రభుత్వం రైట్స్ ఇస్తుందని ఆయన ఇదంతా చేస్తున్నారని చెప్పారు. అసైన్డ్ భూములను కాపాడుకోవాల్సిన అవసరముందని అందుకు ప్రజలంతా పోరాటానికి సిద్ధం కావాలని కవిత పిలుపునిచ్చారు.
రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ ను ఎత్తివేసే కుట్ర చేస్తోందని కవిత అన్నారు. రైతు డిస్కం పేరుతో చేస్తున్న ఈ ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ అడ్డుకోవాల్సిన అవసరముందని చెప్పారు. కొత్త డిస్కం ను ఏర్పాటు చేసి ఇప్పుడు ఉన్న వాటిలో ఒక డిస్కం ను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రైతు డిస్కంను ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా ఏర్పాటు చేయాలని ప్రయత్నించటం ద్వారానే అందులో కుట్ర ఉన్న విషయం అర్థమవుతుందన్నారు. ఈఆర్సీ పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేయటం కారణంగా ఆ విషయం బయటకు తెలిసిందని కవిత గుర్తు చేశారు. రైతు డిస్కం ను వ్యతిరేకిస్తూ రైతులంతా ఈఆర్సీకి ఫిర్యాదు చేయాలని కోరారు.
వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తుండటంపై కవిత ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అత్యధిక మంది ఆధారపడుతున్న ఈ రంగంలో సమూల మార్పులు తేవాల్సి ఉందన్నారు. వ్యవసాయం యోగ్యంగా లేకపోవటంతో చాలా మంది రైతులు ఈ రంగాన్ని వీడుతున్నారంటూ వస్తున్న నివేదికలు ఆవేదన కలిగిస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వాలకు ఉక్కు సంకల్పం ఉంటే వ్యవసాయ రంగంలో అద్భుతాలు చేయవచ్చని కవిత అన్నారు. వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించి పారిశ్రామిక వేత్తలకు ఇస్తున్న సౌకర్యాలన్నీ వ్యవసాయ రంగానికి ఇవ్వాలన్నారు. ఒక పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని సౌకర్యాలు కల్పిస్తారో వ్యవసాయ రంగానికి కూడా అన్ని సౌకర్యాలు సిద్ధం చేసి ఉంచాలని చెప్పారు.
Also red: Jana Sena: తెలంగాణ టార్గెట్‌గా పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహం.. నెక్ట్స్ ప్లాన్..!
నాలుగు పైసలు బిచ్చం వేసినట్లు చేసి ఏదో దయ చూపుతున్నట్లు చేస్తే మార్పు రాదని అన్నారు. పసిబిడ్డను కాపాడినట్లు వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకు కావాల్సిన సమగ్ర కార్యాచరణ తెలంగాణ రక్షణ సేన వద్ద ఉందని కవిత అన్నారు. ముఖ్యంగా వ్యవసాయానికి మార్కెట్ కల్పించాలని, వ్యవసాయ ఉత్పత్తులకు బ్రాండ్ క్రియేట్ చేయాలని చెప్పారు. ఎంపీగా ఉన్న సమయంలో జగిత్యాల మామిడి పండ్లకు బ్రాండ్ క్రియేట్ చేసి డిమాండ్ పెరిగేలా తాను చేశానని కవిత చెప్పారు.
వరి కాకుండా ఇతర పంటలు వేయాలని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేని కారణంగా మళ్లీ భారీ ఎత్తున వరి ధాన్యం పండుతుందని ఆ ధాన్యాన్ని కొనలేక ప్రభుత్వం మరోసారి చేతులేత్తేసే పరిస్థితి వస్తుందని కవిత చెప్పారు. అందుకు పంటల మార్పిడి విషయంలో ప్రభుత్వం శ్రద్ధతో పనిచేయాలని కోరారు. వ్యవసాయ రంగంలో అద్భుతాలు చేసే కార్యాచరణ తమ వద్ద ఉందని కవిత అన్నారు. రైతు కాలనీలు, పార్టీలతో సంబంధం లేకుండా రైతు సంఘాలు ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో పది తీర్మానాలను ఆమోదించినట్లు కవిత చెప్పారు. వాటిని చదివి వినిపించారు. 1. రైతు డిస్కం వద్దు, 2 యూరియ యాప్ తీసేయాలి, 3 బకాయి పడ్డ రైతు భరోసా తక్షణమే ఇవ్వాలి. 4 కౌలు రైతులను గుర్తించి వారికి రైతు భరోసా ఇవ్వాలి. 5 రైతు కూలీలకు రూ. 12 వేలు ఇవ్వాలి. 6. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుల మందు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. 7. మూసీ కాలుష్యాన్ని నివారించాలి. 8 నిమ్మ, బత్తాయి రైతులకు అండగా ఉండాలి.9 పత్తి రైతుల సమస్యలను పట్టించుకోవాలి. 10 రైతు సమస్యలపై ఉమ్మడి కార్యాచరణతో భవిష్యత్ ఉద్యమాలు చేయాలి. ఈ పది తీర్మానాలను ఆమోదించామని అన్నారు.
రెండు లక్షల ఉద్యోగాలు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే పని మొదలుపెట్టాలని కవిత కోరారు. 5 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు కాకుండా 20 వేల పోస్టులకు పెంచాలన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు 15 లక్షల మంది ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూనే ఉంటారని అన్నారు. జీపీఓ, గ్రూప్ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు వేయాలన్నారు. ఎస్సై జాబ్ కు 35 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉందో కానిస్టేబుల్ జాబ్ కు కూడా అదే విధంగా ఇవ్వాలని కోరారు. జీవో 46 ను వెంటనే రద్దు చేసి నిరుద్యోగులకు మేలు చేయాలన్నారు. ఉద్యమకారులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన భూమి కోసం జులై 2 పెద్ద ఎత్తున భూపోరాటం చేయనున్నట్లు కవిత తెలిపారు. ఆ రోజు ఉప్పల్ భగాయత్ లో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటామని…ఈ పోరాటానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని కోరారు.
నల్గొండ జిల్లాలో బత్తాయి రైతుల చాలా కష్టాల్లో ఉన్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో స్థానిక రైతులు చాలా మంది బత్తాయి రైతుల బాధలను వివరించటంతో వారి కష్టాలను తెలుసుకునేందుకు స్వయంగా మాడుగుల మండలంఇందుగుల గ్రామంలో బత్తాయి తోటను పరిశీలించారు. రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. నల్గొండ లో బత్తాయి, నిమ్మ, పత్తి రైతుల కష్టాలపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టాలని కవిత కోరారు. ముఖ్యంగా వారికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. బత్తాయి రైతుల కష్టాల తీరే వరకు వారి తరఫున పోరాటం చేస్తామని చెప్పారు.
రౌండ్ టేబుల్ సమావేశానికి ముందు నల్గొండలోని క్లాక్ టవర్ సర్కిల్ వద్ద పార్టీ జెండాను కవిత ఆవిష్కరించారు. తెలంగాణ మలి దశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత్ చారి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించిన అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.