Kavitha vs Ktr issue: తాజాగా బీఆర్ఎస్ పార్టీ మహిళా నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. పార్టీపై, నాయకత్వంపై, ముఖ్యంగా తన సహోదరుడు కేటీఆర్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ లో తీవ్రంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ కామెంట్స్ సెగ మాత్రం తెలంగాణలో తెగ పాకుతోందని టాక్. మొత్తం మీద కవిత నోట వచ్చిన ఆ కామెంట్స్ ఏమిటో తెలుసుకుందాం.
ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కవిత ఉన్నది ఉన్నట్లు మాట్లాడి కుండ బద్దలు కొట్టారని చెప్పడం కంటే, తన మనసులోని మాటలను తెగేసి చెప్పారని ఆమె అనుకూల వర్గం అంటోంది. ఇప్పటికే గతంలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ నిర్వహణ, ఇతర అంశాలపై మాజీ సీఎం కేసీఆర్ కు లేఖ రాసి సంచలనం సృష్టించిన కవిత తాజా ఇంటర్వ్యూలో మాత్రం కామెంట్స్ కాస్త స్ట్రాంగ్ గానే చేశారు.
ఈ ఇంటర్వ్యూలో భావోద్వేగంతో మాట్లాడిన కవిత.. కేసీఆర్ తర్వాత తాను ఎవరినీ నాయకుడిగా గుర్తించనన్నారు. ఆ స్థానం ఎవరూ భర్తీ చేయలేరని, తాను రాజకీయాల్లోకి వచ్చింది మాత్రం ఆయనను చూసే అన్నారు. తన అన్న కేటీఆర్ తో మొన్నటి వరకు మంచి సంబంధాలు ఉండేవని, కేటీఆర్ తో ఇప్పుడు మాటలు కూడా లేవన్నారు. లేఖ విషయం వెలుగులోకి వచ్చిన సమయం నుండి ఇదే పరిస్థితి కొనసాగుతుందన్నారు. కవిత చెప్పిన ఈ మాటల వెనుక దాగిన బాధ, అసంతృప్తి, లోపలనున్న తీవ్రత స్పష్టంగా కనిపించాయని విశ్లేషకుల అభిప్రాయం.
ఇంతటితో ఆగకుండా ఆమె మాట్లాడుతూ.. పెయిడ్ సోషల్ మీడియా తన మీద ట్రోల్స్ చేస్తోందని, ఇది తనకు తీవ్రంగా బాధ కలిగించిందన్నారు. మా నాన్నగారికి కూడా చెప్పాను. మీరు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పాను. కానీ ఎప్పటికీ పార్టీ నాకు అండగా నిలబడలేదు అంటూ పార్టీ వ్యవస్థపై నిరాశను కవిత వెలిబుచ్చారు. ఈ కామెంట్స్ ను బట్టి కవిత అన్నది బీఆర్ఎస్ సోషల్ మీడియానేనని తెగ ప్రచారం అవుతోంది. తన లిక్కర్ కేసు సమయంలో తనకు అండదండగా ఉన్నది మాత్రం కేసీఆర్ ఒక్కరేనని, బెయిల్ వచ్చేందుకు ఖర్చు కూడా ఆయనే భరించారని కవిత అన్నారు.
ఈ వ్యాఖ్యలు సామాన్యంగా పార్టీ లోపల జరిగే సంఘర్షణలు బయటకు వస్తే, ఎంత పెద్ద విషయంలోకి మారతాయో చూపించాయని చెప్పవచ్చు. గతంలో పార్టీ పునర్నిర్మాణం, ఎన్నికల విషయంలో చేసిన కృషిని గుర్తు చేసుకున్న కవిత, తనకు సరైన గుర్తింపు లభించకపోవడాన్ని సూచించినట్లు కనిపిస్తోంది.
పార్టీలో ఆమెకు ఎదురైన వ్యతిరేక భావన, సోషల్ మీడియా దాడులు, వ్యక్తిగత విమర్శలతో ఆమె బాధపడుతున్నట్లు కనపడుతుంది. ఈ వ్యాఖ్యలతో పాటు, ఆమె ఈ స్థాయిలో బహిరంగంగా మాట్లాడుతూ.. తన కుటుంబంతోనూ, రాజకీయ జీవితంతోనూ ఏర్పడిన విభేదాలను ప్రజల ముందే ఉంచడం తెలంగాణ రాజకీయాల్లో నూతన మలుపుగా మారింది.
కవిత వ్యాఖ్యలపై BRS అధిష్టానం ఇంకా స్పందించలేదు. కానీ పార్టీలో ఉండే ఇతర నేతలు మాత్రం ఒక వైపు ఇది కుటుంబ వ్యవహారమే అని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తుండగా, వాటి అనుకూల సోషల్ మీడియాలు మాత్రం కవిత కామెంట్స్ ను తెగ వైరల్ చేస్తున్నాయి.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో, BRS భవిష్యత్తు, కవిత రాజకీయ భూమిక, KCR కుటుంబ రాజకీయాల్లో ఆత్మీయతల మధ్య విభేదాలు ఇప్పుడు ఒక పబ్లిక్ డిబేట్ గా మారాయి. అసలు కవిత పార్టీకి దూరమవుతారా? లేక ఈ వ్యవహారాన్ని తండ్రి కేసీఆర్ జోలపెట్టబోతున్నారా? అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయ ప్రియులకు ప్రధాన ఆసక్తికర అంశంగా మారింది.
కేసీఆర్ తర్వాత నేను ఎవరిని కూడా నాయకుడిగా గుర్తించను.. నాకు కేటీఆర్ కు మాటలు లేవు.. పార్టీ సోషల్ మీడియా నన్ను TROLLS చేస్తున్నారని మా నాన్న కు చెప్పానంటూ కవిత చేసిన కామెంట్స్ ఇప్పుడు యావత్ తెలంగాణ రాజకీయాన్ని ఓ ఊపు ఊపేస్తున్నాయని చెప్పవచ్చు. ఇటీవల జాగృతి బలోపేతంపై దృష్టి సారించిన కవిత, చివరగా మాత్రం తన తండ్రి కేసీఆర్ కు అండదండగా ఉంటానని, ఆయనే తనకు దేవుడు అంటూ తేల్చి చెప్పడం విశేషం.