KCR With Harishrao: కాళేశ్వరం కమిషన్ నోటీసులతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతోందా? కమిషన్ ముందు కేసీఆర్-హరీష్‌రావులు హాజరవుతారా? ఆరోగ్యం సరిగా లేదని తప్పించుకుంటారా? ఆరోగ్యం సహకరించకుంటే ఆన్‌లైన్ ద్వారా హాజరవుతారా? లేకుంటే కమిషన్ వస్తామంటే ఆ నేతలు ఓకే చెబుతారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
కేసీఆర్‌తో హరీష్ భేటీ
కాళేశ్వరం కమిషన్ నోటీసుల తర్వాత ఎర్రవల్లి ఫాం హౌస్‌లో కేసీఆర్‌తో హరీష్‌రావు భేటీ అయ్యారు. మామ-అల్లుడు మధ్య దాదాపు అరగంటకు పైగానే కమిషన్ నోటీసులపై చర్చ జరిగింది. నోటీసులకు ఏం చెయ్యాలి? విచారణకు వెళ్లాలా? వద్దా? లేకుంటే న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని అడుగులు వేయాలా? వంటి అంశాలపై ఇరువురు చర్చించారు.
కమిషన్ ఓపెన్ కోర్టులు నిర్వహించిన తీరు, అధికారుల స్టేట్‌మెంట్లపై తొలుత చర్చ జరిగింది.ఆ తర్వాత ప్రాజెక్టు వ్యవహారాలు మిగతా అంశాలపై నేతలు చర్చించారట. కమిషన్ ఎలాంటి విషయాలు బయట పెట్టకపోవడంతో విచారణ నుంచి తప్పించుకోలేమని కేసీఆర్ అన్నట్లు గులాబీ వర్గాల నుంచి ఓ ఫీలర్ హంగామా చేస్తోంది.
దీని గురించి న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత మరోసారి భేటీ కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కమిషన్ కేవలం విచారణకు మాత్రమే పిలిచిందని అన్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు ఇచ్చిన సమాధానాలపై నేతలను కమిషన్ ప్రశ్నలు వేసే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ: వారి అకౌంట్లలో లక్ష జమ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
బీఆర్ఎస్ ప్రచారమే కొంప ముంచిందా?
కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్మ, కర్త, క్రియ అన్నింటికి కేసీఆర్ వ్యవహరించినట్టు ఆ పార్టీ ప్రచారం చేసుకుంది. ఇదే విషయాన్ని ఎంపీ ఈటెల పలుమార్లు ప్రస్తావించారు కూడా. ఇంజనీర్లను డమ్మీలుగా మార్చారని గతంలో ఆరోపించారు. దాని ఫలితమే పంపు హౌస్‌లు సైతం మునిగిపోయాయని ఒకానొక సందర్భంలో ఈటెల మీడియా ముందు ప్రస్తావించారు కూడా.
కమిషన్ నోటీసుల విషయంలో కేసీఆర్ విచారణకు హాజరైతే బెటరని అంటున్నారు. మా వైపు అంతా బాగానే చేశామని, భూమిలోని ఇసుక వెళ్లడంతో ఘటన జరిగిందని చెబితే బాగుంటుందని కొందరు నిపుణుల మాట. నిబంధనల ప్రకారం చేశామని కేసీఆర్ చెబితే గౌరవం పెరుగుతుందని అంటున్నారు.
కమిషన్ నోటీసులపై కోర్టుకి వెళ్తే ఆయన ఇమేజ్ డ్యామేజ్ కావచ్చని అంటున్నారు. తెలంగాణ ప్రజల అభిప్రాయం మరోలా ఉంది. కమిషన్ ముందు కేసీఆర్ హాజరుకారని మెజార్టీ ప్రజలు చెబుతున్నారు. ఈ క్రమంలో కమిషన్‌కు లేఖ రాస్తారా? లేకుంటే కోర్టుకు వెళ్తారా? అనేది చూడాలి.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పీసీ ఘోష్ ప్రతీది పద్దతి ప్రకారమే విచారణ చేస్తున్నారు. ఎటుచూసినా హరీష్‌రావు మాత్రం హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యాయ నిపుణుల సలహా తర్వాత ఆయన కమిషన్ ముందు హాజరయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు గులాబీ వర్గాలు.
గతంలో మీడియా ముందు చెప్పిన మాటలే ఈటెల మళ్లీ చెబుతారా ? ప్రాజెక్టు నిర్మాణం సమయంలో అప్పటి ప్రభుత్వం అవలంభించిన విధానాలను బయటపెడతారా? ఇవే ప్రశ్నలు చాలామంది నాయకులకు వెంటాడుతున్నాయి.