KCR New Plans: రాజకీయాల్లో కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అవుతారా? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయనిచ్చిన ఏడాది గడువు పూర్తి అయ్యింది? ఎప్పుడు రంగంలోకి దిగబోతున్నారు? కేవలం బహిరంగ సభల ద్వారా కేడర్ చెదిరిపోకుండా ఉండేందుకు స్కెచ్ వేస్తున్నారా? తన నియోజకవర్గంలో సభకు ప్లాన్ వెనుక అసలేం జరిగింది? దీనిపై ఆ పార్టీ నేతలేమంటున్నారు?
తెలంగాణలో అధికారం పోయిన తర్వాత ఫామ్ హౌస్‌కి పరిమితమయ్యారు మాజీ సీఎం కేసీఆర్. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం సమయంలో అసెంబ్లీకి వచ్చారు. ప్రభుత్వానికి ఏడాది గడువు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పుకొచ్చారు. ఆయన మాటల ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది గడిచిపోయింది. కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తున్నా రంటూ ఇంటా బయటా ఇదే చర్చ జరుగుతోంది.
గతంలో మాదిరిగా కేసీఆర్ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా? కేవలం బహిరంగ సభలకు మాత్రమే పరిమితమవుతారా? ఇదే ప్రశ్న చాలామందిని వెంటాడుతోంది. రేపో మాపో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తోంది రేవంత్ సర్కార్. దీన్ని తనకు అనుకూలంగా మలచుకునే పనిలో పడ్డారాయన. ఈనెల చివరలో భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేశారు.
సభ ద్వారా కేడర్‌ను కాపాడుకోవాలన్నది గులాబీ అధినేత కేసీఆర్ ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధికారం పోయిన తర్వాత నేతలతోపాటు కేడర్ చెల్లాచెదురు అయ్యింది. కేటీఆర్, కవిత, హరీష్‌రావు ప్రజల్లో ఉన్నా.. వారిని కేసులు వెంటాడు తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రంగంలోకి దిగకుంటే మొదటికే ముప్పు వస్తుందని భావించి ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
ALSO READ: ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు, నిందితులు రేపో మాపో అమెరికా నుంచి వచ్చే ఛాన్స్?
ఇటీవల ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు జనగామకు చెందిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు వచ్చారు. వారితో కేసీఆర్ సమావేశమయ్యారు. నేతలు, కార్యకర్తలు చెప్పిన ప్రతీ విషయాన్ని క్షుణ్నంగా విన్నారు. చివరకు తన మనసులోని మాట బయటపెట్టారు పెద్దాయన. ఫిబ్రవరి చివరలో బహిరంగ సభ ఏర్పాటు చేద్దామని వెల్లడించారు. తెలంగాణ శక్తి ఏంటో చూపిద్దామంటూ కేడర్‌ను ఉత్సాహ పరిచేలా మాటలు చెప్పారు.
దాదాపు 5 లక్షల మందితో బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. ఈ విషయం తెలియగానే కొందరు నేతలు ముఖం చాటేశారట. ఇప్పట్లో ఎన్నికలు లేవని, ఇలాంటి సభలు అవసరమా అంటూ కొందరు నేతలు చర్చించుకోవడం మొదలైంది. చాలా ఖర్చు కూడిన పని అని అనుకుంటున్నారు.
కారు పార్టీ వర్గాల నుంచి అందుకున్న సమాచారం మేరకు.. గజ్వేల్‌లో సభల పెట్టాలనే ఆలోచన చేస్తున్నారు. కేసీఆర్-హరీష్‌రావు నియోజకవర్గాలు పక్కపక్కనే ఉండడంతో జనాన్ని భారీగా సమీకరించవచ్చని భావిస్తోంది. ఈ సభ సక్సెస్ అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయన్నది కారు పార్టీ కీలక నేతల అంచనా.
అధికార పార్టీ మొదటి నుంచి ఒకటే డిమాండ్ చేస్తోంది. కేసీఆర్ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని పట్టుబడుతోంది. ఆయన అసెంబ్లీకి రావాలని పదేపదే డిమాండ్ చేస్తోంది. అదిగో ఇదిగో అంటూ కాలం గడుపుతూ వస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మొత్తానికి కాంగ్రెస్ నేతల కోరిక త్వరలో తీరబోతోందన్నమాట.