Kavitha: బీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్సీ కవితపై సంచలన నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుపై కవిత చేసిన ఆరోపణలను కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నుంచి కవితను బీఆర్ఎస్ హైకమాండ్ సస్పెండ్ చేసింది. సస్పెండ్ కు సంబంధించిన లేఖను కూడా అధిష్టానం విడుదల చేసింది.
⦿ అసలు కవిత ఏం మాట్లాడింది…?
బీఆర్ఎస్ సీనియర్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ ఇద్దరు నేతలు భారీ అవినీతికి పాల్పడ్డారంటూ కవిత వ్యాఖ్యానించారు. ఓ ఇద్దరు అధికారులు అధికారులు కూడా రూ.వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ హైకమాండ్ కవితపై సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ రోజు కవితను సస్పెండ్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు అధిష్టానం లేఖను కూడా విడుదల చేసింది.
⦿ సస్పెండ్ ఎందుకు..?
ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలతో పార్టీకి భారీ నష్టం చేకూరే అవకాశం ఉందన్న ఆలోచనతోనే బీఆర్ఎస్ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో కవిత వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బంది కలిగే ఛాన్స్ ఉందని పార్టీ భావించినట్టు సమాచారం. అందుకే నిన్నటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కవితను సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులపై అలా ఎలా సంచలన ఆరోపణలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తల డిమాండ్ నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు పలువురు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
⦿ కవిత వ్యాఖ్యల వెనక ఎవరైనా ఉన్నారా..?
హరీష్ రావు, సంతోష్ రావులపై కవిత చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. అయితే కవిత ఈ వ్యాఖ్యలు చేయడం వెనక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉన్నట్టు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కవిత ఈ వ్యాఖ్యలు చేయడం వెనక కాంగ్రెస్ ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల నిర్ణయం మేరకే ఈ సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చాలని కాంగ్రెస్ కుట్రకు పాల్పడుతోందని అన్నారు. పార్టీకి నష్టం కలిగిస్తే ఎవరిపైనా అయినా చర్యలు తప్పవని పేర్కొన్నారు.
⦿ అసలు కవితకు, బీఆర్ఎస్‌కు గ్యాప్ ఎక్కడ వచ్చింది…?
బీఆర్ఎస్ తరఫున ఒకసారి ఎంపీ, రెండు సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి ఆరు నెలల పాటు జైల్లో ఉన్నారు. అయితే ఉన్నట్టుండి ఏమైందో తెలియదు గానీ.. జైలు నుంచి విడుదల అయ్యాక పార్టీకి, ఆమెకు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. చివరకు కన్న తండ్రిని కూడా కలవలేని పరిస్థితి ఏర్పడింది. జైలు నుంచి విడుదలైన తర్వాతే పార్టీలో ఆమెకు ప్రయారిటీ తగ్గింది. అప్పటి నుంచే బీఆర్ఎస్ కవితను పక్కన పెట్టుకుంటూ వచ్చింది. నాటి నుంచీ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పలు సార్లు మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు కూడా చేసిన విషయం తెలిసిందే..
⦿ కవిత రియాక్షన్ ఎలా ఉంటుంది..?
త్వరలోనే తెలంగాణ జాగృతి పేరుతో సొంత పార్టీ కూడా స్థాపించబోతున్నట్టూ వార్తలు కూడా వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ దేశ పొలిటికల్ హిస్టరీలోనే తండ్రి చేతిలో పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కూతరుగా కవిత నిలిచిపోనుంది. అయితే పార్టీ నుంచి సస్పెండ్ పై కవిత ఇప్పటి వరకు అధికారికంగా రియాక్ట్ అవ్వలేదు. మరీ ఆమె ఎలా రియాక్షన్ ఎలా ఉంటుందో..? చూడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు..